ఆగని బియ్యం స్మగ్లింగ్

30 May, 2016 04:05 IST|Sakshi
ఆగని బియ్యం స్మగ్లింగ్

సాక్షి టాస్క్‌ఫోర్స్ : తడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని తడకండ్రిగ పంచాయతీ మదీనా కుప్పం కేంద్రంగా బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది. పోలీసులు నెల మామూళ్లకు అలవాటుపడి ఏనాడూ అటువైపు తొంగి చూసిన దాఖలాల్లేవని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టపగలే తమిళనాడు నుంచి ఉప్పుడు బియ్యం మండలంలో మదీనాకుప్పం, పూడికుప్పానికి చేరుతున్నాయి. జిల్లా లో వివిధ రేషన్‌షాపుల్లో ఇచ్చే బియ్యం కూడా ఇక్కడికే చేరుతున్నాయి. మదీనా కుప్పంలో ఒకరిద్దరు మత్స్యకారులు ఈ వ్యాపారంలో ఆరితేరిపోయారు. ఇళ్లల్లోనే లోడ్లకు లోడ్లు బియ్యం స్టాక్ చేసి రాత్రి వేళల్లో లారీలకు ఎత్తి పోలీస్‌స్టేషన్ వెనుక వైపు రోడ్డు మీద నుంచి నేషనల్ హైవే ఎక్కి నెల్లూరుకు దర్జాగా తరలిస్తున్నారు.

నెల్లూరులోని కొన్ని రైస్‌మిల్లర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లోనే బియ్యం లోడ్‌చేసి లారీ రోడ్డు ఎక్కే వరకు అడుగడుగునా స్మగ్లర్లు నిఘా పెట్టి దాటించేస్తున్నారు. అయితే ఇదంతా పోలీసుల సహకారంతోనే జరుగుతుందనే ఆరోపణలున్నాయి. సూళ్లూరుపేట, తడ మండలం వాటంబేడుకు చెందిన కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తడలో లారీ బయలు దేరిందంటే తడ నుంచి నాయుడుపేట వరకు అన్ని స్టేషన్లకు మామూళ్లు కట్టుకుంటూ ఒక బ్యాచ్ వెళుతుంది. నాయుడుపేట తర్వాత ఎవరైనా లారీ ఆపితే రూ.10 వేల నుంచి రూ.20 వేలు ముట్టచెప్పి పోతున్నట్లు సమాచారం. బియ్యం అక్రమ వ్యాపారులు తడ, సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్లకు నెలకు రూ.3 లక్షల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నారని ప్రచారం జరుగుతోంది.

గతంలో ఈ వ్యాపారంలో రాజకీయ నాయకులు కూడా భాగస్తులుగా ఉండేవారంటే ఏ స్థాయిలో ఆదాయా లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ వ్యాపారం చేస్తున్న వారు రెండు వర్గాలుగా విడిపోయి లారీలు పట్టించడంతో కొం తకాలం ఆపేశారు. గడిచిన రెండేళ్లుగా మళ్లీ వ్యాపారులు కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి తడ కేంద్రంగా ఈ వ్యాపారాన్ని పునః ప్రారంభించారు. తాజాగా మళ్లీ వీరి మధ్య విభేదాలు  వచ్చాయి.

బియ్యం లారీలు వెళుతున్న విషయాన్ని విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఇటీవల వెంకటాచలం వద్ద ఒక లారీని పట్టుకున్నారు. వెంకటాచలంలోని ఓ రైసుమిల్లులో కూడా రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన వెంటనే నాయుడుపేటలో కూడా పోలీసులు ఒక లారీ ని పట్టుకున్నారు. పోలీసుల సాక్షిగా జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులైనా రంగంలో దిగి పేదల నోటికాడ కూడు లాగేసుకుంటున్న ఈ అక్రమార్కులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు