రుణ మంజూరుకు ప్రత్యేక శిబిరాలు

4 May, 2018 13:56 IST|Sakshi

జాప్యం నివారణకు మండలాల వారీగా  ఏర్పాట్లు

ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): కార్పొరేషన్ల రుణాల మంజూరులో జాప్యం నివారణకు ఇన్‌చార్జి కలెక్టర్‌ సృజన చర్యలు చేపట్టారు. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, కాపు కార్పొరేషన్లతో పాటు బీసీ ఫెడరేషన్, మైనారిటీ, క్రిస్టియన్‌ కార్పొరేషన్లు ద్వారా ఆయా వర్గాల ప్రజలకు కేటాయించిన సబ్సిడీ రుణాలు లబ్థిదారులకు చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కార్పొరేషన్లు ద్వారా బ్యాంకులకు సబ్సిడీ నిధులు విడుదలైనప్పటికీ లబ్ధిదారులకు అందడంలేదు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల పరిధిలోని బ్యాంకు అధికారులు, లబ్ధిదారులకు సమన్వయం ఏర్పరచడానికి మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సృజన నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం నుంచి నిర్దేశించిన తేదీలలో ఆ మండలాలలో లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తే దాదాపు 8 వేల మంది లబ్థిదారులకు ఉపశమనం లభించనుంది. లబ్ధిదారులు సంబంధిత పత్రాలతో శిబిరాలకు హాజరుకావాలని.. లేని యడల ఇప్పటికే వారి బ్యాంకులలో జమ చేసిన నిధులు తిరిగి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

మండలాల వారీగా శిబిరాల తేదీలు
4న మాకవరపాలెం, 5న ఎస్‌.రాయవరం, 7న నక్కపల్లి, 8న కోటవురట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో శిబిరాలు జరుగుతాయి. అలాగే 9న నాతవరం, నర్సీపట్నం, నర్సీపట్నం అర్బన్‌ మండలాలు కలపి నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో, 10న భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, భీమినిపట్నం అర్బన్‌ కలపి భీమునిపట్నం ఎంపీడీవో కార్యాలయంలో శిబిరం నిర్వహిస్తారు. 11న చీడికాడ, చోడవరం కలపి చోడవరం ఎంపీడీవో కార్యాలయంలో, 14న రాంబిల్లి, పరవాడ, అచ్యుతాపురం, మునగపాక కలపి అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేస్తారు. 15న సబ్బవరం, పెందుర్తి కలపి పెందుర్తి ఎంపీడీవో కార్యాలయంలో, 16న ఎలమంచిలి అర్బన్, మండలం కలపి యలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో శిబిరం నిర్వహిస్తారు.  

లబ్ధిదారులు తీసుకురావాల్సినపత్రాలు
రుణం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న దరఖాస్తు
తెలుపు రేషన్‌ కార్డ్, అధార్‌కార్డు
జీఎస్టీతో కూడిన యూనిట్‌ కోటేషన్‌
డ్రైవింగ్‌ లైసెన్స్, బ్యాడ్జి (ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌ వారు)
ఆవులు, గేదెల కోనుగోలు అంగీకార పత్రాలు

మరిన్ని వార్తలు