పుష్కర క్షోభ

19 Jul, 2015 00:19 IST|Sakshi

 పుణ్యస్నానాలకు వెళ్తూ అనంత లోకాలకు
 రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కొడుకులు సహా తండ్రి మృతి
 పాలకొండలో విషాదం
 మరో ఘటనలో మర్రివలస మహిళ మృతి

 పుణ్యఫలం మాటటుంచితే... ఇప్పుడు ఆ ప్రయాణం పలు ప్రాణాలను బలితీసుకుంటోంది. జిల్లాను విషాదంలో నింపుతోంది. తొలిరోజే రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిదిమంది జిల్లావాసులు మృత్యువాత పడిన విషయం మరువకముందే... రెండో రోజు రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మృత్యువు పాలయ్యారు. ఇప్పుడు ఐదో రోజు పాలకొండనుంచి వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురికాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా... మరో ప్రమాదంలో మర్రివలసకు చెందిన ఓ వృద్ధురాలు తుదిశ్వాస విడిచింది.
 
 పాలకొండ/గండేపల్లి/
 జలుమూరు/రాజమండ్రి:పాలకొండకు చెందిన ఒక కుటుంబం పుష్కర స్నానానికి బయలుదేరి మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. జె.రాగంపేట ఆదిత్య ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. పాలకొండకు చెందిన పడాల దుర్గాప్రసాద్ అలియాస్ గోపి(37) భార్య అనూరాధ, కుమారులు యశ్వంత్(6), షణ్ముఖ్(2), బావమరిదితో కలిసి కారులో రాజమండ్రి బయలు దేరారు. జెడ్.రాగంపేట వద్దకు వచ్చేసరికి కారును రోడ్డు పక్కన ఆపి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇద్దరు పిల్లలను ప్రసాద్ రోడ్డు అవతలి వైపునకు తీసుకు వెళుతుండగా విశాఖ వైపు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమైన యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్, షణ్ముఖ్‌లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జగ్గంపేట, గండేపల్లి ఎస్సైలు సురేష్‌బాబు, రజనీకుమార్‌లు అక్కడకు చేరుకుని గాయపడ్డ ఇద్దరినీ మరో కారులో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ప్రసాద్ మృతి చెందగా, షణ్ముఖ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘనతో అనురాధ షాక్‌కు గురయ్యారు. ఆమె ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌లో అపస్మారక స్థితిలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 ఆనందంగా సాగిపోతున్న కుటుంబంలో...
 ఆనందంగా సాగిపోతున్న కుటుంబం వారిది. దుర్గాప్రసాద్ కుటుంబం తండ్రి మధుసూధనరావు, లక్ష్మిలతోనే ఉంటోంది. అరమరికలు లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న వారి సంసారంలో పుష్కర ప్రయాణం పెను విషాదం నింపింది. దుర్గా ప్రసాద్ పాలకొండలో సిరి పాఠశాల నిర్వహిస్తున్నారు. పాఠశాలకు సెలవులు వచ్చాయన్న ఆనందంలో భార్య, పిల్లలు పుష్కరాలకు వెళ్దామని కోరితే తండ్రికి చెప్పి శుక్రవారం రాత్రి మరికొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరాలకు బయలు దేరారు. కానీ తెల్లవారేసరికి కొడుకు, మనవలు మృతి చెందినట్టు వార్త విన్న ఆ కుటుంబం ఒక్కసారిగా గొల్లుమంది. మధుసూధనరావుకు గుండెపోటు ఉందన్నకారణంగా మొదట సమాచారం చేరవేయలేకపోయినా విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి స్పృహతప్పి పడిపోయింది.
 వెంటనే ఇక్కడి కుటుంబ సభ్యులు అక్కడకు పరుగులు తీశారు. పాఠశాల నిర్వహిస్తున్న గోపి పేదపిల్లలనుంచి ఫీజులు తీసుకునేవాడు కాదనీ, అందరితో కలివిడిగా ఉంటూ అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారని స్థానికులు కన్నీటి పర్యంతమౌతున్నారు. మృతదేహాలను పాలకొండ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
 
 మరో సంఘటనలో...
 రాజమండ్రి కోటిలింగాలఘాట్‌లో వాటర్ ప్యాకెట్ల బస్తాలతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి దూసుకురావడంతో జలుమూరు మండలం మర్రివలసకు చెందిన గుడ్ల మీనాక్షి(70) మృతి చెందింది. గ్రామానికి చెందిన మీనాక్షితో పాటు మరికొందరు శనివారం తెల్లవారుజామున కోటిలింగాలఘాట్‌కు చేరుకున్నారు. ఐదో నంబర్ అప్రోచ్ రోడ్డు మీదుగా వెళుతున్న వ్యాన్ అదుపుతప్పడంతో వృద్ధురాలిపైకి దూసుకొచ్చింది. కలెక్టర్ అరుణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఎన్‌డీఆర్‌ఎస్ సిబ్బంది ద్వారా వ్యాన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మృతురాలు మీనాక్షికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్దకొడుకు సోమేశ్వరరావు, కోడలు లక్ష్మితో పుష్కరస్నానానికి వెళ్లి మృత్యువుపాలైంది.
 

మరిన్ని వార్తలు