ఆదాయం అదిరింది...

17 Oct, 2015 02:06 IST|Sakshi
ఆదాయం అదిరింది...

గుంటూరు జిల్లా     రిజిస్ట్రేషన్ల        శాఖకు కాసుల పంట
 ఆర్థిక సంవత్సరం     తొలి ఆరు నెలల్లోనే         రూ. 279 కోట్ల రాబడి
 ప్రభుత్వం భూముల విలువ పెంచినా జోరు తగ్గని     రిజిస్ట్రేషన్లు
రాజధాని నేపథ్యంలో     భూక్రయ విక్రయాల్లో అదే ఊపు
ముందుచూపుతో     వాలిపోతున్న రియల్టర్లు,        బిల్డర్లు, వ్యాపారసంస్థలు

 
గుంటూరు :  జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండుతోంది. అంచనాలు మించి ఆదాయం వచ్చి పడుతోంది. కోట్లలో విధించుకున్న రాబడి లక్ష్యాలను అవలీలగా దాటేందుకు ఉరకలు పెడుతోంది. ఇంతకాలం నిర్దేశించిన లక్ష్యాన్ని సైతం చేరుకోవడానికి ఆపసోపాలు పడ్డ ఈ శాఖ ఇప్పుడు రాజధాని అమరావతి పుణ్యమా అని లెక్కకుమిక్కిలి భూ క్రయవిక్రయాలతో దూసుకు పోతోంది. 2015-2016 ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖకు ప్రభుత్వం రూ.675 కోట్ల రాబడి లక్ష్యం విధిస్తే, సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల కాలానికి ఏకంగా రూ.279 కోట్లను ఆర్జించింది. రానున్న ఆరునెలల్లోనూ నూరుశాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా పరుగులు తీస్తోంది. వాస్తవానికి రాజధాని ప్రకటనతర్వాత జిల్లా పరిధిలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం భూముల విలువను నూరు శాతం పెంచినా రిజిస్ట్రేషన్ల జోరు తగ్గకపోవడం విశేషం.

 పిసరంతైనా భూమి చాలు..
 అమరావతి కేంద్రంగా ప్రభుత్వం రాజధానిని ప్రకటించడంతో గుంటూరు జిల్లాలో ప్రస్తుతం భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు  వచ్చి భారీగా ఇప్పుడు ఆస్తులను కొనుగోలు చేస్తున్నాయి. రాజధాని శంకుస్థాపన తరువాత ఆస్తుల విలువ అమాంతం పెరిగే అవకాశాలు ఉంటాయనే భావనతో చాలామంది వ్యాపారులు, బడా వ్యక్తులు ముందుగానే భూములను కొనుగోలు చేస్తున్నారు. సొంతంగా ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ధనికులు సైతం రాజధానిలో స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ కారణాలన్నింటితో ఇప్పుడు భూముల క్రయవిక్రయాలు జిల్లాలో బాగా పెరిగాయి.
 జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు పోటెత్తుతున్నాయి.

ఫలితంగా 2015-2016 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు  ప్రభుత్వం రూ.675 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా విధించగా, సెప్టెంబర్ నాటికి రూ.279 కోట్ల ఆదాయం రావడంతో అధికారులే ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు రిజిస్ట్రార్ పరిధికి రూ.371.99కోట్ల వార్షిక ఆదాయ లక్ష్యం విధిస్తే ఆరు నెలల్లోనే రూ.139.69 కోట్ల రాబడి వచ్చింది.  నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రూ.214 కోట్ల లక్ష్యానికి రూ.99.55కోట్లు జమైంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.67.55 కోట్లు మాత్రమే. తెనాలి రిజిస్ట్రార్ కార్యాలయ పరిధికి రూ.89 కోట్ల లక్ష్యానికి  రూ. 38.95 కోట్లు వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.32.41 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.

 మున్ముందు ఇంకా...
 జిల్లాలో భూ క్రయవిక్రయాలు రెట్టింపవుతాయని ముందే ఊహించిన ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి వందశాతం  మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల రిజిస్ట్రేషన్ల ఫీజు భారీగా పెరిగి క్రయవిక్రయాలు కొంతవరకు తగ్గుతాయని అధికారులు అంచనావేశారు. కాని రాజధాని ప్రాంతం కావడంతో ఇవేం లెక్కచేయకుండా క్రయవిక్రయదారులు ఊపులో ఉండడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య  పరుగులు తీస్తోంది. ఫలితంగా  జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు వద్దన్నా ఆదాయం వచ్చి పడుతోంది. ముఖ్యంగా సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాలకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసింది. ఈ 29 గ్రామాల్లో ఎటువంటి క్రయవిక్రయాలు జరిగినా, వెబ్‌సైట్ వివరాలను ఆధారంగా చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖను కొద్దిరోజుల కిందట ఆదేశించింది. ఈనేపథ్యంలో మున్ముందు రిజిస్ట్రేషన్లు మరింత ఊపందుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు