‘లింగమనేని’పై ఐటీ దాడులు

5 Mar, 2020 05:11 IST|Sakshi

విజయవాడలోని ఎల్‌ఈపీఎల్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌లో సోదాల్లో కీలక పత్రాల స్వాధీనం  

సాక్షి, అమరావతి: చంద్రబాబు బినామీగా భావిస్తున్న లింగమనేని రమేష్‌కు చెందిన ఎల్‌ఈపీఎల్‌ గ్రూపుపై ఢిల్లీ నుంచి వచ్చిన ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని గాయత్రీనగర్‌లో ఉన్న ఎల్‌ఈపీఎల్‌ కార్పొరేట్‌ ఆఫీసుపై ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మాజీ సీఎం చంద్రబాబు కృష్ణానది తీరాన ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌లోనే నివాసం ఉండటంతోపాటు అమరావతి రాజధాని ల్యాండ్‌పూలింగ్‌ను లింగమనేని స్థలాల సరిహద్దు వరకు తీసుకొచ్చి ఆపేసిన సంగతి తెలిసిందే.

అలాగే హైదరాబాద్‌ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు ఎల్‌ఈపీఎల్‌కు చెందిన రెయిన్‌ట్రీ అపార్ట్‌మెంట్స్‌ను కేటాయించడం ద్వారా ఏటా కోట్ల రూపాయల్లో అద్దెలను చెల్లిస్తున్నారు. అంతేగాక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తోనూ లింగమనేనికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. విజయవాడ గాయత్రీ నగర్‌లోని ఎల్‌ఈపీఎల్‌ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు ఆ పార్టీకి గుంటూరు జిల్లా కాజ వద్ద జాతీయరహదారికి ఆనుకొని ఉన్న అత్యంత విలువైన రెండెకరాల భూమిని కారుచౌకగా ఇచ్చిన విషయమూ తెలిసిందే. ఇలా ఇరు పార్టీలకు అత్యంత సన్నిహితంగా ఉన్న లింగమనేని గ్రూపుపై ఇప్పుడు ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుండటంతో రెండు పార్టీల నేతల్లో ఆందోళన మొదలైంది.

శ్రీచైతన్య గ్రూపు కార్యాలయాల్లో ఐటీ సోదాలు..
కార్పొరేట్‌ విద్యాసంస్థ శ్రీచైతన్య గ్రూపు కార్యాలయాలపై ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉన్న కార్యాలయంతోపాటు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ఉన్న కార్పొరేట్‌ కార్యాలయంలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. రికార్డులను స్వాధీనం చేసుకుని కాలేజీ డైరెక్టర్లు, మేనేజర్లను విచారిస్తున్నారు. ఐటీ తనిఖీలపై ఇటు కాలేజీ యాజమాన్యం కానీ, అటు ఐటీ అధికారులు కానీ స్పందించట్లేదు. 

మరిన్ని వార్తలు