నీరున్నా కన్నీరేనా..?

19 Feb, 2015 01:13 IST|Sakshi

తుమ్మికాపల్లి ఆనకట్ట పనులు పూర్తయ్యేదెప్పుడంటున్న రైతులు
అసంపూర్తి నిర్మాణాన్ని పరిశీలించిన జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ

 
గజపతినగరం రూరల్ : విజయనగరం డివిజన్ పరిధిలోని తుమ్మికాపల్లి ఆనకట్ట పనులు ముందుకు సాగకపోవడంతో ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1988లో అప్పటి మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు హయాంలో తుమికాపల్లి ఆనకట్ట నుంచి నీటిని వి డుదల చేశారు. రెండేళ్ల పాటు బాగానే నీరు వచ్చినా ఆ తర్వాత నుంచి ఒక్క నీటిబొట్టు కూడా రైతు పొలాల్లోకి వెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి రైతులు సాగునీరు ఇస్తారేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఆనకట్ట పరిధిలో భూపాల పురం, ఆనందపురం, చింతలపేట,నడుపూరు, కొత్తపేట, నారాయణ పట్నంతో పాటు మరి కొన్ని గ్రామాల భూములు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ భూములు బీడువారుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఆనకట్టకు అప్పట్లో *89.60 లక్షలు విడుదలయ్యాయి. అందులో ఎంత ఖర్చు చేశారు అని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. దీంతో విజయనగరం నుంచి నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.వెంకటరమణతో పాటు ఆ శాఖ డీఈ, జేఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్లు బుధవారం తుమ్మికాపల్లి ఆనకట్ట వద్ద పరిశీలించారు.

70 లక్షల ఖర్చంట...

ఆనకట్ట నిర్మాణానికి ప్రభుత్వం అప్పట్లో విడుదల చేసిన *89.60 లక్షల్లో *70 లక్షలను హుద్‌హుద్ ముందు ఖర్చు చేశామని అధికారులు చెబుతుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1991 నుంచి ఒక్క నీటి చుక్క కూడా పొలాలకు రాలేదని, అంత ఖర్చు చేశామని చెబితే ఎలా నమ్మేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆనకట్ట వద్ద ఉన్న సుమారు 50 పాలింగ్ షెట్టర్లు పాడైపోయి, సాగు నీటి కాలువ వద్ద పూడికలు పేరుకుపోయి,  బెర్ములు లేకుండా ఉన్న సమయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని ఎలా చెప్పగలుగుతున్నారని నిలదీస్తున్నారు.

 అసంపూర్తి ఆనకట్టల నిర్మాణానికి చర్యలు: ఈఈ

జిల్లాలోని అసంపూర్తి ఆనకట్టల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా నీటి పారుదల శాఖ ఈఈ ఎం.వెంకటరమణ తెలిపారు. ఆయన బుధవారం తుమికాపల్లి ఆనకట్టను ఆయన సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుమ్మికాపల్లి ఆనకట్టకు *78లక్షల అంచనా విలువను వేయగా ప్రభుత్వం *89.60లక్షలు విడుదల చేసిందని, అందులో *70లక్షలను ఆనకట్టకు ఖర్చు చేశారని, *19.60లక్షలతో మిగిలిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

తాటిపూడి ప్రాజెక్ట్ ఆధునికీకరణకు సంబంధించి ’24 కోట్లు రాగా అందులో *7కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. మెంటాడ మండలం గుర్ల వద్ద అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ పనులు కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక దేవుడు జేఈ, ఇరిగేషన్ డీఈ ఎల్.గోవిందరావు, జేఈ స్వామి నాయుడు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు రామచంద్రి నా యుడు, సూర్యనారాయణ రాజు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు