పవర్ తెగవాడేశారు

29 May, 2015 02:29 IST|Sakshi
పవర్ తెగవాడేశారు

- నగరంలో రెట్టింపు స్థాయిలో విద్యుత్ వినియోగం
- సగటున 2 మిలియన్ యూనిట్ల వాడకం
- వేసవి తీవ్రతతో 4 మిలియన్ యూనిట్లు దాటిన వైనం
- ఈనెల 26న రికార్డు స్థాయిలో 4.434 మిలియన్ యూనిట్లు ఖర్చు
సాక్షి, విజయవాడ :
నగరంలో విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ కోటాకు మించి రెట్టింపు స్థాయిలో ప్రజలు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రోజు రోజుకూ పెరిగిన ఎండ తీవ్రతకు పోటీగా విద్యుత్ ఖర్చయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ నిరంతర సరఫరాకు తంటాలు పడుతోంది. వారం నుంచి రోజుకు 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతోంది. ఈ నెల 26వ తేదీన డిస్కం చరిత్రలో అత్యధికంగా 4.434 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను నగరవాసులు వినియోగించారు. నగరంలో సగటున రోజూ రెండు నుంచి 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతుంది.

సాధారణంగా ఏడాది పొడవునా ఇలానే ఉన్నా వేసవిలో మాత్రం 3 నుంచి 3.5 మిలియన్ యూనిట్ల వాడకం జరుగుతుంది. అయితే విజయవాడ రాష్ట్ర రాజధాని నగరంగా మారడం, దీనికి తోడు నగరానికి వచ్చి వెళ్లే వారి సంఖ్య పెరగడం, ఈ ఏడాది ఇబ్బడి ముబ్బడిగా షాపింగ్ మాల్స్ ఏర్పాటవడంతో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలో రోజూ సుమారు రెండు లక్షల ఏసీలు పని చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

దీంతో విద్యుత్ వాడకం పెరిగి అనేక ప్రాంతాల్లోని ప్రధాన ఫీడర్లపై ఓవర్‌లోడ్ పడుతోంది. నగరంలో సుమారు 2.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 33 కేవీ, 11కేవీ ఫీడర్ల ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుం టారు. ఈ క్రమంలో విజయవాడ టౌన్ డివిజన్ పరిధిలో 3, గుణదల సబ్‌డివిజన్ పరిధిలో మరో 3 సబ్‌స్టేషన్ల పరిధిలో ఓవర్‌లోడ్ అధికంగా ఉంది. అయితే ఈ వేసవికి ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఫీడర్లపై మార్పులు చేసి వోల్టేజ్ సమస్య రాకుండా నియంత్రించగలుగుతున్నారు.

నగరంలో 11 కేవీ ఫీడర్లు 176 ఉన్నాయి. వీటిలో 18 ఫీడర్లకు నిత్యం ఓవర్‌లోడ్ సమస్య ఎదురవుతోంది. వచ్చే నెల 15వ తేదీ వరకు విద్యుత్ వినియోగం అధికంగానే ఉంటుందని అధికారులు నిర్ధారించి ఆమేరకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా కోటాను కూడా వేసవి వరకు కొంత పెంచుకునే యోచనలో విద్యుత్ అధికారులు ఉన్నారు. వచ్చే నెల రెండో వారం నాటికి నగరంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ఏర్పాటు కానున్నాయి.

ఫలితంగా విద్యుత్ వినియోగం మరితం అధికమవుతుంది. ఈ నెల 26వ తేదీన డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 4.434 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగింది. 27న 4.373 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. అంతకు ముందు వారం రోజుల పాటు సగటున 3.75 మిలియన్ యూనిట్ల నుంచి 4 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వాడకం జరిగింది.

మరిన్ని వార్తలు