వాహనదారులపై రవాణా బాదుడు

11 Jan, 2017 03:57 IST|Sakshi
వాహనదారులపై రవాణా బాదుడు

భారీగా ఫీజులు పెంచిన రవాణా శాఖ
ఎల్‌ఎల్‌ఆర్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు అన్నింటిపైనా వడ్డన


విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వం ప్రజల నెత్తిన మరోభారం మోపింది. రవాణా శాఖలో నిర్వహించే వివిధ పనులకు సంబంధించి చార్జీలను అమాంతం పెంచేసింది. వాహన రిజిస్ట్రేషన్‌ చార్జీలతోపాటు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర ఫీజులు భారీగా పెరిగాయి. రవాణా శాఖ ద్వారా అందించే 83 రకాల సేవలకు సంబంధించి వసూలు చేసే చార్జీలు, ఫీజులను 10 శాతం నుంచి 100 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది.

పెరుగుదల వివరాలు..
ఇప్పటివరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసిన వారి నుంచి ఎల్‌ఎల్‌ఆర్‌ నిమిత్తం రూ.90 వసూలు చేస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.260కు పెంచారు.  ఇది టూవీలర్‌ ఎల్‌ఎల్‌ఆర్‌కు మాత్రమే. అదనంగా ఫోర్‌ వీలర్‌కు గానీ, ఆటోరిక్షాకు గానీ ఎల్‌ఎల్‌ఆర్‌ కావాలంటే.. ఒక్కోదానికీ రూ.150 చెల్లించాలి. డ్రైవింగ్‌ లైసెన్సు ఫీజు రూ.550 ఉండేది. దాన్ని రూ.960కి పెంచారు. లైసెన్సు రెన్యువల్‌కు రూ.485 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ.660కి పెంచారు. చిరునామా మార్పునకు గతంలో రూ.560 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ.660 మొత్తానికి పెంచారు. అదేవిధంగా ఎండార్స్‌మెంట్‌కు గతంలో రూ.560ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1260కుపెంచారు. టూవీలర్‌ రిజిస్ట్రేషన్‌కు గతంలో రూ.445 ఉంటే.. దాన్ని రూ.685 కు పెంచారు. కారుకు గతంలో రూ.735 ఉంటే దాన్ని ఇప్పుడు 1135కు పెంచారు. వాహనాన్ని బదిలీ చేయడానికి గతంలో టూవీలర్‌కు రూ.410 ఉంటే.. ఇప్పుడు అది రూ.535కు పెరిగింది. కారుకు గతంలో రూ.635ఉంటే ఇప్పుడు రూ.835కు పెరిగింది.

ఏడాదికి రూ.80 కోట్ల మేర అదనపు భారం
ప్రభుత్వం రవాణా చార్జీలు పెంచడం వల్ల జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.కోట్లలో భారం పడనుంది. అన్ని రకాల సేవలు  ఫీజులు, చార్జీలు పెరగడం వల్ల ఏడాదికి అదనంగా సుమారు రూ.80 కోట్ల వరకు భారం పడనుంది.

మరిన్ని వార్తలు