మొబైల్‌ గేమ్స్‌ మోత

11 Apr, 2020 04:38 IST|Sakshi

లాక్‌ డౌన్‌తో గేమ్స్‌ యాప్‌లకు పెరిగిన క్రేజ్‌

దేశంలో 200 శాతం పెరిగిన యూజర్లు

వీటి టర్నోవర్‌ రూ.7 వేల కోట్లకు చేరుతుందని గూగుల్‌–కేపీఎంజీ అంచనా 

సాక్షి, అమరావతి: లాక్‌ డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సర్వం స్తంభించిపోయిన వేళ మొబైల్‌ గేమ్స్‌ మోత మోగిస్తున్నాయి. ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్‌ ఫోన్లలో డిజిటల్‌ గేమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కాలక్షేపం కోసం టీవీల్లో కార్యక్రమాల్ని చూస్తున్న వారు కొందరైతే, ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలతో పాటు మొబైల్‌ గేమింగ్‌ యాప్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు వారాలుగా దేశంలో మొబైల్‌  గేమింగ్‌ యాప్‌లకు క్రేజ్‌ విపరీతంగా పెరుగుతోంది. 

భారీగా పెరుగుతున్న యూజర్లు
► మొబైల్‌ గేమింగ్‌ సెక్టార్‌లో ‘గేమ్స్‌ 2 విన్‌’ యాప్‌ యూజర్లు బాగా పెరుగుతున్నారు. లాక్‌ డౌన్‌కు ముందు ఆ యాప్‌ను వినియోగించే వారు రోజుకు సగటున 12 లక్షల మంది పెరుగుతుండేవారు. రెండు వారాలుగా యూజర్లు రోజుకు 15 లక్షల మంది పెరుగుతున్నారు.
► బాజీ గేమ్‌’ యాప్‌నకు మరింత క్రేజ్‌ పెరుగుతోంది. ఆ యాప్‌ అందిస్తున్న ‘పోకర్‌ బాజీ’ గేమ్‌పై యువతలో ఆసక్తి ఉండటంతో గడచిన రెండు వారాల్లో ఆ యాప్‌ యూజర్లు 15 శాతం పెరిగారు. 
​​​​​​​► ఇప్పటివరకు చిన్న పట్టణాల వరకే పరిమితమైన ‘విన్‌ జో’ గేమింగ్‌ యాప్‌నకు నిప్పుడు మెట్రో నగరాల్లోనూ డిమాండ్‌ పెరిగింది. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఆ యాప్‌ యూజర్ల సంఖ్య 41శాతం పెరిగింది.
​​​​​​​► క్రికెట్‌ గేమింగ్‌ యాప్‌లకు క్రేజ్‌ అమాంతంగా పెరిగింది. ‘హిట్‌ వికెట్‌’, ‘రియల్‌ క్రికెట్‌’ గేమింగ్‌ యాప్‌ల యూజర్లు 15శాతం పెరిగారు. 
​​​​​​​► ‘గేమర్‌ జీ’ మొబైల్‌ యాప్‌ యూజర్లు కూడా పెరుగుతున్నారు. ‘పేటిమ్‌ ఫస్ట్‌ గేమ్స్‌’ యాప్‌ యూజర్లు 200 శాతం పెరిగారు.
​​​​​​​► లాక్‌డౌన్‌కు ముందు మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ల పీక్‌ టైం రాత్రి 7నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండేది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పీక్‌ టైమ్‌గానే ఉంటోంది.
​​​​​​​► ఇదే సందర్భంలో స్టేడియంలలో జరిగే క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను అనుసరిస్తూ మొబైల్‌ ఫోన్ల ద్వారా ఆటలు ఆడించే లైవ్‌ గేమింగ్‌ యాప్‌లు మాత్రం క్రీడా పోటీలు నిలిచిపోవడంతో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి.

2021 నాటికి 31 కోట్ల యూజర్లు 
దేశంలో గేమింగ్‌ యాప్‌ల మార్కెట్‌ మరింతగా విస్తరిస్తుందని గూగుల్‌–కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2021నాటికి దేశంలో మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ల యూజర్లు 31 కోట్లకు చేరుతారని అంచనా వేసింది. 2019లో రూ.6,200 కోట్లుగా ఉన్న మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ల టర్నోవర్‌ 2021 నాటికి రూ.7 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

మరిన్ని వార్తలు