ఉసురు తీస్తున్న వడగాల్పులు

29 May, 2015 01:32 IST|Sakshi

1,344కు పెరిగిన వడదెబ్బ మృతులు
స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు


హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిన నేపథ్యంలో వీస్తున్న వడగాలులను తట్టుకోలేక వృద్ధులు, పిల్లలతోపాటు చాలా చోట్ల మధ్యవయస్కులు మరణిస్తున్నారు. ఈ వేసవిలో వడగాల్పుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య గురువారం సాయంత్రానికి అధికారిక గణాంకాల ప్రకారమే 1,344కు  చేరింది. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ధ్రువీకరించింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 305 మంది వడదెబ్బతో మృత్యువుపాలయ్యారు. అనధికారిక లెక్పకల ప్రకారం ఈ మృతుల సంఖ్య రెండువేలుపైగా ఉంటుందని అంచనా. ఇక గురువారంనాడు రాష్ట్రవ్యాప్తంగా  29 మంది చనిపోయారు.

ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 16 మంది ఉన్నారు. బుధవారంతో పోల్చితే గురువారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. మరో రెండు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ  నిపుణులు తెలిపారు. ఈ మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు నిధులు లేవని జిల్లా కలెక్టర్లు పేర్కొన్నారు. అత్యవసరమైతే ట్రెజరీ రూల్-27  కింద నిధులు డ్రా చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ  ఉత్తర్వులిచ్చారు.
 

మరిన్ని వార్తలు