పెరిగిన ‘కృష్ణపట్నం’ వ్యయం

29 May, 2015 01:25 IST|Sakshi
పెరిగిన ‘కృష్ణపట్నం’ వ్యయం

రూ.5 వేల కోట్లకుపైగా అదనం తప్పుబట్టిన కాగ్
 

హైదరాబాద్: ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఖర్చుపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) వివరణ కోరినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యయా న్ని పెంచారన్న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించిన నేపథ్యంలో ఏపీఈఆర్‌సీ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరణ ఇచ్చేందుకు ఏపీ జెన్‌కో మల్లగుల్లాలు పడుతోంది. వాస్తవానికి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్స్ మెగావాట్‌కు రూ. 5.5 కోట్లకు మించి వ్యయం కాకూడదు. కానీ కృష్ణపట్నం ప్రాజెక్టులో ఇందుకు విరుద్ధంగా ఖర్చు పెట్టారు.మెగావాట్‌కు రూ.8 కోట్ల వ్యయం చేశారు. ఇలా ప్రాజెక్టు వ్యయం రూ.12,850 కోట్లకు చేరినట్టు సమాచారం.

అనుమతి తీసుకున్నారా?

 అనూహ్యంగా ప్రాజెక్టు వ్యయం పెరిగినప్పుడు విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఎందుకు పాటించలేదని ఏపీఈఆర్‌సీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఏపీ జెన్‌కో ఎండీ చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టును రూ. 10,450 కోట్లతో ప్రతిపాదించారు. 2011లో దీని వ్యయం ఏకంగా 12 వేల కోట్లకు చేరింది. గత ఏడాది మార్చి వరకూ రూ. 10,780 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది ఇంకా ఆడిట్  పూర్తి కాలేదు. పాత లెక్కల ప్రకారం లెక్కిస్తే ఇప్పుడది 12,850 కోట్లకుపైగానే ఉండే వీలుంది. కాగ్ తాజా నివేదికలో దీన్నే ప్రస్తావించింది. మెగావాట్‌కు ఏకంగా 3.3 కోట్ల మేర ఎక్కువ ఖర్చు చేశారు. ఈ లెక్కన 1,600 మెగావాట్లకు రూ.5,200 కోట్లు ఎక్కువగా వెచ్చించినట్టు తెలుస్తోంది. దీనికి నిర్ధిష్టమైన కారణాలు చూపాలని ఏపీఈఆర్‌సీ కోరుతోంది. ఏకంగా రూ 5వేల కోట్లకుపైగా ప్రాజెక్టు వ్యయం పెరగడాన్ని కాగ్ ఆక్షేపించింది.
 
 

మరిన్ని వార్తలు