పెరిగిన విద్యుత్ కోతలు

16 Jun, 2014 01:25 IST|Sakshi

విశాఖపట్నం: విద్యుత్తు కోతలతో జనం విలవిల్లాడుతున్నారు. విశాఖలో ఆదివారం నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది గంటలు విద్యుత్ సరఫరాలో కోతలు విధించారు. మరో రెండు రోజులు ఈ కోతలు తప్పవని ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థకు ఐదు జిల్లాల పరిధిలో 2100 మెగావాట్ల విద్యుత్తు అవసరముంది. దీనిలో విద్యుత్తు కొరత కారణంగా 1750 నుంచి 1800 మెగావాట్ల కంటే విద్యుత్తు సరఫరా జరగడం లేదు.

పరిశ్రమలకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు కొరత వల్ల అనధికారికంగా అధికారులు కోత విధిస్తున్నారు. వడగాడ్పులు, వాతావరణంలో మార్పుల వల్ల విద్యుత్తు వినియోగం మరింత పెరిగింది. ప్రస్తుతం విద్యుత్తు కొరతగా ఉన్నందున రెండు రోజులుగా నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కోతలు పెరిగిపోయూరుు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఈపీడీసీఎల్ అధికారులు అంటున్నారు.

దీంతో జనం అల్లాడిపోతున్నారు. విద్యుత్తులేకపోవడంతో గాలి ఆడక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం వల్లే సర ఫరా చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఎన్టీపీసీలో 500 మెగావాట్లు, సింహాద్రిలో 500 మెగా వాట్లు, ఆర్‌టీ పీపీ 210, కేటీపీపీలో 500 మెగావాట్లు, కేటీఎస్-ఏబీసీలో 120 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయిందని, దీంతో సరఫరాకు గండిపడినట్టు అధికారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు