నిండు కుండల్లా..

8 Sep, 2019 07:04 IST|Sakshi
డొంకరాయి నుంచి శబరిలోకి రెండుగేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

రిజర్వాయర్లకు జలకళ

గరిష్టస్థాయికి నీటి మట్టాలు

పూర్తిగా నిండిన డొంకరాయి జలాశయం

గోదావరిలోకి 10 వేల క్యూసెక్కులు విడుదల 

రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సు పరిధిలోని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. రెండురోజులపాటు కురిసిన వర్షాలకు రిజర్వాయర్లన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జోలాపుట్‌ మొదలుకుని తూర్పుగోదావరి జిల్లా పొల్లూరు రిజర్వాయర్‌ వరకు ప్రస్తుతం నీటి మట్టాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి.  అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి.

సాక్షి, సీలేరు: విద్యుత్‌ను నిరంతరం ఉత్పత్తి చేసే జలాశయాల్లో భారీగా నీరు చేరడంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రం మినహా అన్నింటిలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జోలాపుట్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 2,749.25 అడుగుల్లో ప్రమాదస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో మరింత నీరు చేరితే రిజర్వాయర్‌ నిండిపోతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై 20 వేల క్యూసెక్కుల నీటిని బలిమెల రిజర్వాయర్‌లోకి వదులుతున్నారు. బలిమెల జలాశయంలోకి కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మెల్లమెల్లగా నీరు చేరుతుంది.

గత 15 రోజుల కిందట కురిసిన వర్షాలకు రిజర్వాయర్‌లో భారీగా నీరు చేరింది. దీంతో ఇరు రాష్ట్రాల విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వాడుకున్నారు. 1516 అడుగుల నీటి మట్టానికి గాను 1497.01 అడుగుల్లో నీటిమట్టం ఉంది. 19 అడుగుల తేడాతో ఉన్న నీటిమట్టం జోలాపుట్‌ నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇరు రాష్ట్రాలు విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా సీలేరు (గుంటవాడ) రిజర్వాయర్‌ 1360 పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 1348 అడుగులకు నీరు చేరింది. దీనికి ఉపనదులైన పిల్లిగెడ్డ నుంచి ప్రస్తుతం వర్షపునీరు చేరుతుంది. దీని దిగువున ఉన్న సీలేరు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

గరిష్టస్థాయికి ‘డొంకరాయి’
సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పాలగెడ్డ, వలసగెడ్డ, మంగంపాడు ఉపనదుల నుంచి వస్తున్న వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయింది. 1037 పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను శనివారం సాయంత్రానికి పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు మెయిన్‌ డ్యాం నుంచి శబరినదిలోకి 10 వేల క్యూసెక్కులును రెండు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండడంతో నీటి విడుదల కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం (ఫోర్‌బై) జలవిద్యుత్‌ కేంద్రంలో మొన్నటి వరకు డొంకరాయి పవర్‌ కెనాల్‌ గండి పడడంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నీరు లేక జెన్‌కో అధికారులు ఇబ్బందులు పడేవారు.

అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఏవీపీ డ్యాం 930 అడుగుల సామర్ధ్యం అయినప్పటికీ శనివారం పూర్తిగా నిండిపోవడంతో గేట్లను ఎత్తి పవర్‌ కెనాల్‌ ద్వారా పొల్లూరు డ్యాంలోకి నీటిని మళ్లిస్తున్నారు. వర్షాలకు అలిమేరు వాగు నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. దీంతో ఫోర్‌బై జలవిద్యుత్‌కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నీటి కొరత లేదని, పీక్‌లోడ్‌ అవర్స్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు సరిపడిన నీరు ఉందని ఏపీ జెన్‌కో ఎగ్జిక్యుటివ్‌ ఇంజనీర్‌ వి.ఎల్‌ రమేష్‌ తెలిపారు. కురుస్తున్న వర్షాల కారణంగా నీరు ఎప్పటికప్పుడు చేరుతుండడంతో అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు