రెవెన్యూలో పెరిగిన  పనిభారం

16 Jul, 2018 02:42 IST|Sakshi

విధులతోపాటు ఇతర పనులు చేయక తప్పని పరిస్థితి

పోస్టులు మాత్రం పెంచని సర్కార్‌.. ఖాళీగా 5,000 పోస్టులు

మానవ వనరులు లేక పెండింగ్‌లో పనులు

సాక్షి, అమరావతి: తీవ్రంగా పెరిగిన పనిభారంతో రెవెన్యూ ఉద్యోగుల తలబొప్పి కడుతోంది. పనిభారం రెట్టింపయినా ఉద్యోగులను మాత్రం ప్రభుత్వం పెంచడం లేదు. ఉన్న ఖాళీల భర్తీకి కూడా చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సుమారు 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ‘1986లో తాలూకాల స్థానంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మండల వ్యవస్థను తెచ్చింది. ఒక్కో తాలూకా రెండు మూడు మండలాలు అయ్యాయి. ఉన్న ఉద్యోగులనే మండలాలకు సర్దుబాటు చేసింది కానీ పోస్టుల సంఖ్య పెంచలేదు. గత 32 ఏళ్లలో జనాభా పెరిగింది.

కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, రకరకాల నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ), పంచనామాలు లాంటి విధులు పెరిగాయి. ఇవేకాకుండా ఓటర్ల జాబితాల సవరణ, అభ్యంతరాల స్వీకరణ, ప్రజాసాధికార సర్వే, గ్రామసభలు, జన్మభూమి సభలు, రైల్వే, రోడ్లు, పరిశ్రమలు తదితరాలకు భూసేకరణ లాంటి పనులు రెట్టింపయ్యాయి. ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా రెవెన్యూ శాఖనే ముందుగా కనిపిస్తోంది. చౌక దుకాణాలకు నిత్యావసర సరుకులు వచ్చాయో? రాలేదో? డీలర్లు వీటిని పంపిణీ చేశారో? లేదో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లే చూడాలి. వాస్తవంగా ఇందులో చాలా పనులు రెవెన్యూ శాఖకు సంబంధం లేనివి. అయితే ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రతి పనికీ రెవెన్యూతోనే లింకు పెట్టి భారం మోపుతోంది’ అని క్షేత్రస్థాయి ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

బరువు మోపేందుకేనా?
‘అన్ని విధులూ మా నెత్తిన పెట్టడానికైతే రెవెన్యూ కీలకమని సర్కారు చెబుతోంది.. పేరుకు రెవెన్యూ శాఖ అయినా చేసేది మాత్రం సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలే. మమ్మల్ని సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల్లా గుర్తించాలంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఏ విధంగానూ రెవెన్యూ శాఖకు సంబంధం లేని వ్యవహారం. అయినా ప్రభుత్వం దీనికీ మమ్మల్నే బాధ్యులను చేసింది. రెవెన్యూ ఉద్యోగులు ఎక్కువగా వ్యక్తిగత మరుగుదొడ్ల టార్గెట్లు సాధించడంపైనే దృష్టి పెట్టారు. దీంతో ఇతర రెవెన్యూ పనులన్నీ పెండింగులో పడిపోయాయి’ అని ఒక జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వాపోయారు. 

సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులుగా గుర్తించాలి
రెవెన్యూ ఉద్యోగులు సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల్లా అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాకు కలెక్టరేట్‌ అనేది జిల్లా సచివాలయం. అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లు ఇక్కడకు వస్తాయి. రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం అనేది     డివిజన్‌కు సచివాలయం లాంటిది. అందువల్ల రెవెన్యూ ఉద్యోగులను సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులుగా గుర్తించి ప్రత్యేక స్కేల్‌ ఇవ్వాలని దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సీసీఎల్‌ఏలో ఉంది. త్వరగా దీన్ని ఆమోదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.  
 – బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. 

మరిన్ని వార్తలు