పెరుగుతున్న సిజేరియన్లు

4 Aug, 2018 13:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముహూర్తం చూసి మరీ కోత కోయమంటున్నకుటుంబ సభ్యులు!

తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్న వైద్యులు

వ్యాపారంగా మార్చుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు

బిడ్డ పుట్టాక ముహూర్తం చూడడం ఒకప్పటి పద్ధతి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ముందుగానే ముహూర్తం చూసుకుని మరీ బిడ్డను బలవంతంగా బయటకు తీసుకువస్తున్నారు. అమ్మ కడుపులో నుంచి ఎప్పుడు బయటకు రావాలో ఆ పసిప్రాణానికి ఎవరూ చెప్పనక్కర్లేదు. సహజ రీతిలో జరిగే ప్రక్రియ ద్వారా అమ్మను ఏడిపించి మరీ బిడ్డ బయటకు వస్తుంది.

ఇలా రావడం ద్వారా తల్లిని ఏడిపించినా జన్మంతా అమ్మకు ఎన్నో విధాల మేలు చేస్తుంది. కానీ బిడ్డకు ఆ స్వేచ్ఛనివ్వకుండా బలవంతాన బయటకు తీస్తున్నారు. ఎప్పుడో విషమ పరిస్థితుల్లో వినియోగించాల్సిన ‘సిజేరియన్‌’ అస్త్రాన్ని అవసరానికి మించి వాడుతున్నారు. యుక్తి మరిచి కత్తిని వినియోగిస్తున్నారు. ఫలితంగా అమ్మ బతుకు ప్రమాదంలో పడుతోంది. కోతల కారణంగా జీవితమంతా తల్లి శరీరం మూల్యం చెల్లించుకుంటూనే ఉంటుంది.    

 వజ్రపుకొత్తూరు : సిజేరియన్‌.. ఒకప్పుడు గర్భిణులంతా భయపడిన పదం. కానీ ఇప్పుడు అదే పదం మాటిమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మ నీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లోనే ఇది వరకు ఆపరేషన్‌ చేసేవారు. కానీ ఇప్పుడు అవసరం లేకపోయినా కత్తి వాడుతున్నారు.

కత్తి గాటు పడనిదే బిడ్డ బయటకు రావడం లేదంటే అతిశయోక్తి కాదు. సహజ కాన్పులో వేదన తప్ప ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా ఈ పద్ధతికే ఓటేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మారు మూల పల్లె వాసులు కూడా ఆపరేషన్‌కే వెళ్తుండడం గమనార్హం.

జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 40 శాతం వరకు సిజేరియన్‌ చికిత్సలే ఉంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది.

ముహూర్తం పెట్టుకుని మరీ..

సిజేరియన్లపై జిల్లా వాసులు ఎంతగా మక్కువ చూపుతున్నారంటే.. ఆపరేషన్లకు ముందుగానే ముహూర్తం పెట్టుకుని మరీ వస్తున్నారు. అంటే ప్రసవానికి ముందే వారు ఆపరేషన్‌కు ఫిక్సైపోతున్నారు. వారే అలా సిద్ధమయ్యే సరికి డాక్టర్లదేముంది. వారికి సర్ది చెప్పే మాట అటుంచి చాలా మంది ఆపరేషన్‌ చేయడానికి సిద్ధమైపోతున్నారు. కొందరు డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం మాత్రం విని పించుకోవడం లేదు.

సిజేరియన్‌తో ఇవీ ఇబ్బందులు..

  •  సహజ ప్రసవ సమయంలో ప్రొలాక్టిన్‌ వంటి హార్మోన్లు విడుదల కావడం వల్ల బాలింతలో సహజంగానే చనుబాలు ఉత్పిత్తి జరుగుతుంది. అదే సిజేరియన్‌ అయితే పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టమవుతుంది.
  • ముర్రుపాలు పట్టకపోతే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.
  •  సిజేరియన్‌ సమయంలో మూత్రనాళానికి, పేగులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
  •  శస్త్ర చికిత్స జరిగితే కొన్ని రోజుల వరకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.
  •  నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. బాలింతలు రోజల తరబడి మంచానికి అతుక్కుపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
  •  కదలికలు తక్కువ కావడం వల్ల హెర్నియా వంటి సమ్యలు వస్తాయి.
  • పీరియడ్స్‌ సమయంలో అధిక రక్త స్రావం వంటివి చోటు చేసుకుంటాయి.                                                                                         

 ఎన్నెన్నో కారణాలు..

  •  ఆహారపు అలవాట్లలో మార్పు రావ డం, బయటి తిళ్లు ఎక్కువగా తీసుకో వడం వంటివి సైతం గర్భిణుల ఆరో గ్యంపై చెడు ప్రభావం చూపుతోంది.
  • వ్యాయామ లేమి, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి కారణాల వల్ల గర్భం దాల్చినప్పటి నుంచి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
  •  రక్తపోటు, చక్కెర శాతం పెరగడం, థైరాయిడ్‌ వంటి అనారోగ్య ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి లక్షణాలు ఉండే మహిళలకు సిజేరియన్‌ చేస్తున్నారు.

ఇదీ వ్యాపారమే..

ఒక శస్త్ర చికిత్సకు జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల వారు సుమారు రూ.30వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఇది ఓ మేజర్‌ ఆపరేషన్‌కు తీసుకున్నంత మొత్తంలో ఉంటోంది. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 50 నుంచి 90 వరకు వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీటిలో 80 శాతం వరకు సిజేరియన్‌ కేసులే ఉంటాయి. సహజ ప్రసవం జరిగితే తల్లీ బిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చును.

ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇది ఒక వ్యాపారంగా మారి పోవడంతో సంపాదనే పరమావధిగా తయారైంది. సహజ ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో స్థాయిని బట్టి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. అదే సిజేరియన్‌ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజులు వరకు ఉండాలి. ఆస్పత్రి స్థాయిని బట్టి ఖర్చు రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు చార్జి చేస్తుండడం విశేషం. ఇంత ఖర్చుకు కూడా కుటుంబ సభ్యులు వెనుకాడడం లేదు.

ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ..

సిజేరియన్లు చేయడంలో ప్ర భుత్వ ఆస్పత్రులతో పోల్చి తే ప్రైవేటు ఆస్పత్రుల వారు అధికంగా ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు మాత్రం సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ బయట ఆస్పత్రుల్లో అవగాహన కల్పించకుండానే కోత కోస్తున్నారు.

ఇటీవల కాలం లో వీటిపై న్యాయ పరమైన చిక్కులు కూడా వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బిడ్డ చనిపోవడమో, తల్లి మృత్యువాత పడడమో జరుగుతోంది. ఇలాంటి సమయాల్లో వైద్యుల నిర్లక్ష్యం అంటూ రోడ్డుపై బైఠాయింపులు, కోర్టులకు వెళ్లడాలు వంటివి రోగులు చేస్తున్నారు.

బిడ్డపైనా ప్రభావం ఇలా..

  •  బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది.
  • అసహజ రీతిలో శస్త్రచికిత్స ద్వారా బిడ్డ జననం జరిగితే కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది.
  • ముఖ్యంగా కత్తిగాట్ల వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది.
  • కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పం దనలపై పడుతుంది.
  • శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి.
  • బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువగాను లేదా తక్కువగాను విడుదలై అవి భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి.

సిజేరియన్‌ ఎప్పుడు చేస్తారు..?

  • గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు.
  • గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం.
  • గర్భాశయ ముఖ ద్వారాన్ని మాయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లో సిజేరియన్‌లు చేస్తారు.
  • తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితుల్లో సిజేరియన్‌ చేస్తారు.

అవసరమైతేనే చేయాలి.. 

సిజేరియన్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయాలి. అందులో గర్భిణి ఆరోగ్య స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే సహజ ప్రసవం కోసం ఎదురు చూడా లి. ద్వారం చిన్నగా ఉండడం, ఎదురు కాన్పు సమయాల్లో ఎక్కువగా సిజేరియన్‌లు చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం లేమి వంటి కారణాలు ఉన్నాయి. బీపీ, సుగర్, థైరాయిడ్‌ వంటి సమస్యలు కొంత మేర సిజేరియన్‌కు కారణం కావచ్చు. ఇవి 1000 మందిలో ఒకరి ఉంటుంది. సిజేరియన్‌లో ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానం అమలులో ఉంది. అయితే సిజేరియన్‌ల విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు.

    – డాక్టర్‌ కె. లీల, డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ, వైద్య ఆరోగ్య శాఖ   

మరిన్ని వార్తలు