ఆమెకేది రక్షణ?

30 Jan, 2014 03:32 IST|Sakshi

 ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఆడదంటే చులకనభావం సమాజంలో ఇంకా రాజ్యమేలుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే.. పుట్టకముందే కొన్నిచోట్ల చిదిమేస్తున్నారు. మరికొన్నిచోట్ల పుడమిపైకి రావడానికి బంగారుతల్లికి అవస్థలెన్నో. ఉన్నత చదువులతో అన్నిరంగాల్లో మగవారికి ధీటుగా రాణిస్తున్నా మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. చదువు, ఉపాధిలోనే కాదు కుటుంబ పోషణలో.. సమస్యల్లో ఇంటిపెద్ద పాత్ర పోషిస్తున్నా ఆదరించలేని నైజం చాలా మందిది.

 మహిళ అంతరిక్షంలోకి అడుగుపెట్టినా శభాష్ అని తట్టి ప్రోత్సహించలేని సంస్కారం చాలామందిలో కనిపిస్తోంది. ఆడవారిని అదుపులో పెట్టుకోవాలి.. అణచిపెట్టాలనే ధోరణి మృగాళ్లలో కోరలు చాస్తోంది. చట్టాలెన్నీ తెచ్చినా ఆడవారిపై అఘారుుత్యాలు, హింస, వేధింపుల పరంపర కొనసాగుతోనే ఉంది. పేదరికం.. నిరక్షరాస్యత.. సమస్యలను పరిష్కరించుకునే ఆత్మస్థైర్యం లేకపోవడం.. ఒంటరిననే భావన.. మహిళను అశక్తురాలిని చేస్తోంది.

 కాపురాల్లో మద్యం చిచ్చు
  మద్యం వ్యసనం ఎన్నో కాపురాల్లో చిచ్చుపెడుతోంది. కుటుంబాలను కూల్చుతోంది. ఆర్థిక సమస్యలు తెచ్చిపెడుతోంది. కుటుంబ పోషణ భారం చేసి, దంపతుల మధ్య గొడవలు సృష్టిస్తోంది. ఆయూ సమస్యలు పరిష్కరించుకోలేక చాలామంది దంపతులు ఠాణా మెట్లెక్కుతున్నారు. న్యాయస్థానాల తలుపు తడుతున్నారు.

 మరికొందరు సర్దుకుపోలేక హత్యలు, ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా ఆడది తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని పేర్కొన్న జాతిపిత గాంధీజీ మాటలు ఇప్పట్లో నిజమయ్యేలా లేవు. ఆడవారిపై అఘారుుత్యాలు పుణ్యమా అని వారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో దుష్పరిణామాలు తప్పవు.

మరిన్ని వార్తలు