మాయమవుతుండ్రు!

9 Dec, 2013 23:36 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: అదృశ్యం కేసులపై ఖాకీలు అలక్ష్యాన్ని వీడటం లేదు. అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ 24 గంటల్లో లభ్యం కాకపోతే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుంది. వ్యక్తి ఫొటో, వివరాలను పత్రికల్లో ప్రచురణ కోసం పోలీసులు ప్రకటన విడుదల చేయాలి. అదృశ్యమైన వ్యక్తి తరుచూ సందర్శించే ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు సమాచారాన్ని చేరవేయాలి. కుటుం బ సభ్యులతో కలిసి పోలీసు సిబ్బంది అనుమానిత ప్రదేశాలకు వెళ్లి ఆచూకీ కోసం ఆరా తీయాలి. కానీ, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయకుండా రోజులు, వారాల తరబడి కాలయాపన చేస్తున్నారు. చివరకు కేసు నమోదు చేసినా దర్యాప్తు చేపట్టకుండా కేసులను నీరుగారిస్తున్నారు.

అదృశ్యమైన వ్యక్తుల కేసుల దర్యాప్తు కోసం జిల్లాలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు శాఖ పేర్కొంటోంది. కానీ, ఆ బృందాలు దర్యాప్తు చేసి ఒక్క కేసు చిక్కుముడి విప్పిన దాఖలాల్లేవు. అసలాంటి బృందాలున్నట్లు సొంత శాఖ అధికారులకే తెలి యదు. ఫిర్యాదుదారులు రోజులు, వారాల తరబడి పోలీసు స్టేషన్‌ల చుట్టూ చక్కర్లు కొట్టి అలసిపోతున్నారు. ఆచూకీ లభిస్తే మేమే కబురు పంపుతాం.. మీరు పదేపదే రావద్దని పోలీసులు కరుకుగా చెప్పి తిప్పి పంపుతున్నారు. దీంతో  అదృశ్యమవుతున్న వ్యక్తులు ఏమైపోతున్నారో అంతు చిక్కడం లేదు. ఆత్మీయుల ఆచూకీ లభించక అయినవాళ్లు అంతులేని ఆవేదనలో మునిగిపోతున్నారు.
 భారీగా పెరిగిన అదృశ్యాలు
 ఈ ఏడాది అదృశ్యం కేసులు భారీగా పెరిగాయి. జిల్లా నేర రికార్డుల విభాగం(డీసీఆర్‌బీ) గణాంకాల  ప్రకారం .. గడిచిన 11 నెలల్లో జిల్లాలో ఏకంగా 439 మంది అదృశ్యమయ్యారు. అందులో 349 మంది ఆచూకీ లభ్యం కాగా.. మరో 90 మంది ఏమైపోయారో ఇంత వరకు తేలలేదు.బాలలు, మహిళలు, పురుషులు.. వీరిలో ఎవరు అదృశ్యమైనా దర్యాప్తు చేయకుండా పోలీసులు ఓ అభిప్రాయానికి వస్తున్నారు. ఈ ఏడాది 150 మంది బాలలు అదృశ్యం కాగా.. అందులో 126 మంది తిరిగి రాగా,  24 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. యువతీయువకులు అదృశ్యమైతే ప్రేమ వ్యవహారమేనని ఫిర్యాదును బుట్టదాఖలు చేస్తుండడంతో కన్నవాళ్ల ఆవేదన మరింత పెరిగిపోతోంది.

 ఇక స్త్రీలు, పురుషుల అదృశ్యం వెనక మానసిక, ఆర్థిక సమస్యలు కారణమవుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 154 మంది స్త్రీలు అదృశ్యమైనట్లు కేసులు నమోదు కాగా.. అందులో 128 మంది ఆచూకీ లభ్యమైంది. మిగిలిన 26 మంది ఆచూకీ తేలలేదు. అదే విధంగా 135 మంది పురుషులు కనిపించకుండా పోగా అందులో 95 మంది లభ్యమయ్యారు. 45 మంది ఆచూకీ నేటికీ తేల లేదు. ఇప్పటికైనా పోలీసులు సక్రమంగా దర్యా ప్తు చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు