ముందుకొస్తున్న ముప్పు

31 Jul, 2019 08:31 IST|Sakshi
సముద్ర ప్రవాహానికి పడిపోయిన తాటి చెట్లు 

సాక్షి, మందస(శ్రీకాకుళం) : ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న ఉద్దానం ప్రజలకు కష్టాలు వీడటంలేదు. తిత్లీ తుఫాన్‌తో సర్వస్వం కోల్పోయిన ఉద్దానం రైతాంగాన్ని సముద్రం రూపంలో ప్రకృతి ఇంకా భయపెడుతునే ఉంది. మండలంలోని దున్నవూరు పంచాయతీ, గెడ్డవూరు ప్రాంతం, భేతాళపురంలలో సుమారు 100 మీటర్లను దాటించి సముద్రం ముందుకు వచ్చేస్తోంది. నాలుగైదు రోజులుగా తీరంలోని కొబ్బరి, జీడిమామిడి తోటల వరకు అలలు తాకుతున్నాయి. భేతాళపురం తీరంలో సముద్రం మరింత ముందుకు వచ్చి చెట్లను పెకలిస్తోంది. ఇదే గ్రామంలోని గుంటు గున్నయ్య అనే రైతుకు చెందిన కొబ్బరి, టేకు, తాటి చెట్లు కూలిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. అలల తాకిడికి తీరం కోతకుగురవుతోంది. 

ఆలయాలకు ముప్పు..
మత్స్యకారులు తీరంలో దేవతలు, గ్రామదేవత, అమ్మవార్లకు చిన్న, చిన్న ఆలయాలు నిర్మించుకుని వేటకు వెళ్లే ముందు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. సముద్రం ముందుకు రావడంతో ఈ ఆలయాల వరకు అలలు వస్తున్నాయి. ఇసుకలో నిర్మితమైన ఈ ఆలయాలు సముద్రుడు ఆగ్రహిస్తే కూలిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి తీరంలో విహారానికి ఉపయోగపడే ఇసుక దిబ్బలు సముద్రంలో కలిసిపోగా, అదే పరిస్థితి మందస మండలంలో కూడా నెలకొంది. భేతాళపురం, రట్టి, లక్ష్మీపురం, గంగువాడ తదితర ప్రాంతాల్లో అలల ప్రవాహానికి నీటి తాకిడి పెరుగుతుండడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తీర ప్రాంతవాసులు భయపడుతున్నారు. 
ఎన్నడూలేని విధంగా చెట్లు కూలిపోతుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు.  

ఆందోళనగా ఉంది..
ఎన్నడూలేని విధంగా సముద్రం ముందుకు వస్తోంది. నీటి ప్రవాహానికి చెట్లు కూలిపోతున్నాయి. నా తోటలోని కొబ్బరి, టేకు చెట్లు సముద్రం ముందుకు రావడంతో పడిపోయాయి. తిత్లీ తుఫాన్‌ సమయంలో తీవ్ర నష్టం కలిగించింది. ఈ నష్టం నుంచి తేరుకోక ముందే సముద్రం భయపెడుతోంది. సుమారు నెల రోజులుగా అలల తాకిడి పెరుగుతోంది. సాధారణ స్థాయిని దాటింది. తోటలు, ఒడ్డు వరకు సముద్రం ఎప్పుడూ రాలేదు. నేటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.       
– గుంటు గున్నయ్య, బాధిత రైతు, భేతాళపురం, మందస 

మరిన్ని వార్తలు