మంట కలుస్తున్న బాంధవ్యాలు

30 Aug, 2017 09:22 IST|Sakshi
మంట కలుస్తున్న బాంధవ్యాలు
► మనిషిలో పెరుగుతున్న స్వార్థం
► చిన్న వివాదాలతోనే గొడవలు
► హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వైనం
► కౌన్సెలింగ్‌ అవసరమంటున్న నిపుణులు
 
రోజులు మారుతున్నాయి.. మనుషులు మారుతున్నారు.. వారి ప్రవర్తనలో మార్పు వస్తోంది.. అనుకున్న వస్తువు, లేదా మరేదైనా దక్కకపోతే దానవులుగా మారిపోతున్నారు. మమతలు, అనురాగాలు, ప్రేమాభిమానాలు మరిచిపోయి కట్టుకున్న పెళ్లాన్ని, కడుపున పుట్టిన బిడ్డను సైతం హత్య చేస్తున్నారు. వ్యక్తిలో పెరుగుతున్న స్వార్థ చింతనే దీనికంతటికీ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఇది సంక్లిష్ట పరిస్థితిగా మారిపోయింది. ఇక రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
తిరుపతి క్రైం : కారణాలు ఏవైనా జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు, వ్యాపార లావా దేవీలు, ఆస్తి గొడవలతో మనుషులన్న విచక్షణను కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు. ప్రవర్తనలో మార్పును గమనించిన వెంటనే మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి నైతిక విలువలు, బంధాలు, బంధుత్వాల గురించి తెలియజేయాల్సి ఉంది. అప్పుడే సమసమాజ నిర్మాణం జరిగి ప్రపంచం నందన వనంగా మారుతుంది. 
 
► రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు తమిళనాడు నుంచి వచ్చి గది అద్దె కు తీసుకున్నారు. పూటుగా మద్యం సేవించారు. వారి మధ్య జరిగిందో కాని ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని హతమార్చి పరారయ్యారు. 
► తనకు తెలియకుండా వ్యవహారం నడుపుతున్నాడనే నెపంతో యువకుడిని కలికిరి మండలంలో అతిక్రూరంగా హింసించి హత్య చేశారు.
► ఐదు రోజుల క్రితం రేణిగుంట ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో బాబు అనే వ్యక్తిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. 

► ఈ నెల మొదటి వారంలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బు వివాదం చోటు చేసుకుంది. దీంతో కలిసి చదువుకున్న స్నేహితుడని కూడా చూడకుండా కిరాతకంగా స్నేహితుడే హత్య చేశాడు. 
► మదనపల్లిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కొడుతుండగా అడ్డు వచ్చిన అత్తను అల్లుడు దారుణంగా హత్య చేశాడు. 
 
కొరవడిన నిఘా వ్యవస్థ
జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఒక హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతోనే హత్యలకు పాల్పడుతున్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు. పేరుకు మాత్రమే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని, భార్యాభర్తల మధ్య అనుమానాలు తొలగిస్తున్నామని చెబుతున్నారు. జరిగినా సంఘటన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ప్రకటనలు వదలివేసి జరుగుతున్న హత్యలకు కారణాలు తెలుసుకుని ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
అన్ని చోట్ల మార్పులు రావాలి
వ్యక్తుల్లో నేను, నాది అన్న భావన రానురాను బలంగా వేళ్లూనుకుంటోంది. కూర్చుని చర్చించుకుంటే పరిష్కారమయ్యే చిన్న చిన్న సమస్యలపై హత్యలు చేసే స్థాయికి వస్తుండడం వ్యక్తిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచీ చెడ్డ చెప్పాల్సిన తల్లిదండ్రులే సహనం కోల్పోతున్నారు. మనిషి అన్న ఆలోచనలు మరచిపోతున్నారు. చిన్న పిల్లలకు మనిషి ప్రాణాలు, విలువలు తెలియజేయాల్సిన వయస్సులో వారే దారితప్పుతున్నారు. క్షణికావేశానికి లోనై ఆలోచించకలిగే శక్తి ఉన్నా అనాలోచిత నిర్ణయాలతో ప్రాణాలు తీస్తున్నారు.
 
కౌన్సెలింగ్‌ అవసరం
రక్త సంబంధం ఉన్నవారినే హత్య చేస్తున్న వారి ప్రవర్తనను ఒక కోణంలో విశ్లేషించలేం. అన్ని కోణాల్లోనూ పరిశీలించాలి. పాఠశాల వయస్సు నుంచే యుక్త వయస్సు వచ్చే వరకు పెరిగిన విధానాన్ని తెలుసుకోవాలి. ఏదో చిన్న సమస్యకే హత్యలు చేస్తున్నారంటే బంధాలు, బంధుత్వాల గురించి తెలియదు. చిన్నతనం నుం చి తల్లిదండ్రులకు దూరంగా పెరి గిన వారిలో ఈ తరహా భావా లు ఎక్కువగా ఉంటాయి. క్షణికావే శం పడుతున్న వారికి కౌన్సెలింగ్‌ అవసరం. అప్పుడే ఉద్వేగాలను ని యంత్రించగలం.  – డాక్టర్‌ ఎన్‌ఎన్‌ రాజు, మానసిక నిపుణులు 
మరిన్ని వార్తలు