ఒత్తిడే.. చిత్తు చేస్తోంది!

8 Jan, 2014 00:02 IST|Sakshi
ఒత్తిడే.. చిత్తు చేస్తోంది!

పరిగి, న్యూస్‌లైన్:  మారుతున్న జీవన శైలి ప్రతి మనిషిని ఒత్తిడికి గురిచేస్తున్నది. ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో చూస్తున్న కొందరు ఆత్మహత్యకు మొగ్గుచూపుతున్నారు. అప్పుల బాధతో రైతు.. నాన్న తిట్టాడని కుమారుడు, ప్రేయసి ప్రేమకు అంగీకరించలేదని ప్రియుడు, ప్రేమించిన వాడు కాదన్నాడని ప్రియురాలు, భర్త తిట్టాడని భార్య, భార్య మాట వినలేదని భర్త... ఇలా ఎన్నో బలవన్మరణాలు. చిన్నచిన్న కారణాలే ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. పది నుంచి పదహారేళ్ల వయసున్న పిల్లలు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. గడిచిన రెండుమూడేళ్లలో పరిగి ప్రాంతంలో ఆత్మహత్య కేసులు అనేకం నమోదయ్యాయి. ఆర్థిక సంబంధ కారణాలు కొన్నయితే.. సామాజికంగా అవగాహన లేకపోవడం,
 
 నిరక్షరాస్యత వంటిని మరికొన్ని కారణాలు.   
 రైతుల ఆత్మహత్యల్లో, సాధారణ ఆత్మహత్యల్లో జిల్లాలోనే పరిగి ప్రాంతం మొదటి స్థానంలో ఉంది. ఆత్మహత్యల్లో 90శాతం వరకు విషం, పురుగు మందు తీసుకున్నవే ఉంటున్నాయి. పరిగి ప్రభుత్వాస్పత్రిలో నెలకు 50 నుంచి 80 వరకు విషం తీసుకుంటున్న కేసులు వస్తున్నాయి. నియోజకవర్గస్థాయిలో 100నుంచి 150 కేసులు నమోదవుతున్నట్లు ఆయా ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను బట్టి తెలుస్తోంది. గడిచిన ఏడాదిలో నియోజకవర్గంలో 1,100  వరకు ఆత్మహత్యాయత్నాలు చోటుచేసుకోగా ఇందులో 172మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు 22 మంది. ఇవి పోలీస్ రికార్డుల్లో నమోదైనవి మాత్రమే. నమోదు కానివి ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిలో చాలా మందిని రక్షిస్తున్నా 20 శాతం మంది మాత్రం మృత్యుముఖం చూస్తున్నారు.  
 
 ఒత్తిడే  ప్రధాన కారణం
 ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 90శాతం మంది ఒత్తిడికి తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మానసిక వైద్యులు చెబుతున్నారు. వృత్తిపరమైన, కుటుంబ పరమైన సమస్యలతో డిప్రెషన్‌లోకి వెళ్లే వారు రోజురోజుకు పెరుగుతున్నారని వారు పేర్కొంటున్నారు.
 ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం 20నుంచి 35 సంవత్సరాలలోపు వారే ఉంటున్నారు. తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడడంతో వారి పిల్లలు అనాథలైన ఘటనలు అనేకం ఉన్నాయి.
 
 ఒత్తిడి జయించడమే మార్గం
 ఒత్తిడిని జయిస్తేనే ఆత్మహత్యలు తగ్గుతాయి. ఈ ప్రాంతంలో చిన్నచిన్న కారణాలతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబంలోని తల్లిదండ్రులు ఒత్తిడికిలోనయితే ఆ ప్రభావం పిల్లలపైనా పడుతుంది. సామాజిక అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, ఆర్థిక పరిస్థితి తదితర కారణాలు ఆత్మహత్యల వైపు మళ్లడానికి కారణమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  సమస్యను ఆత్మీయులతో పంచుకోవాలి.
 - వేణుగోపాల్‌రెడ్డి, పరిగి సీఐ
 
 సకాలంలో వస్తే కాపాడగలం
 విషం తాగిన వారికి సొంత వైద్యం చేయకుండా వెంటనే తీసుకురావాలి. సకాలంలో తీసుకొస్తేనే బతికే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా ఆస్పత్రికి వస్తున్న ఆత్మహత్యాయత్నం కేసుల గురించి మేం ఆరా తీస్తాం.. దాని వెనుక చాలా చిన్నచిన్న కారణాలు ఉంటున్నాయి. సీరియల్ చూస్తున్నప్పుడు భర్త వద్దన్నాడని, భార్య అడిగిన కూర వండలేదని.. ప్రారంభమయ్యే గొడవలు ఆత్మహత్యల వరకూ వెళ్తున్నాయి. కొంచెం మనసును అదుపులో ఉంచుకుంటే వీటిని అధిగమించొచ్చు.
 - డాక్టర్ ధశరథ్ , ఎస్పీహెచ్‌ఓ పరిగి క్లస్టర్
 
 బాంధవ్యాలు బాగుండాలి
 కుటుంబంలో అందరితో బాంధవ్యం బాగుండాలి. సమస్యను మనసు విప్పి చర్చించే వాతావరణం కుటుంబంలో ఏర్పడాలి. తల్లిదండ్రులతో ఎటువంటి విషయాన్నయినా చర్చించేందుకు పిల్లలు వెనకాడకుండే పరిస్థితి కల్పించాలి. ఒత్తిడిని జయించేందుకు పెద్దలు, పిల్లలు యోగా వంటివి చేయాలి. ప్రాణం విలువ, ఏ సమస్యకైనా పరిష్కారం ఉందన్న విషయాలను తెలియజెప్పాలి. సమస్య తీవ్రమైతే సైకాలజిస్టు వద్దకు వెళ్లడం మరవొద్దు.
 - సత్తిబాబు, సైకాలజీ అధ్యాపకులు

>
మరిన్ని వార్తలు