పెట్రేగుతున్న దొంగలు

18 Sep, 2019 09:04 IST|Sakshi

పేట్రేగుతున్న దొంగలు

వరుస చోరీలతో హడలెత్తిస్తున్న వైనం

పోలీసులకు సవాల్‌ విసురుతున్న చోరీలు

పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీకాస్తున్నారు. కార్డన్‌ సర్చ్‌ పేరుతో జల్లెడ పడుతున్నారు. అయినా జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. ఒక చోరీ కేసు దర్యాప్తులో ఉండగానే.. ఇంకో ప్రాంతంలో దొంగతనం జరుగుతోంది. ఎంత నిఘా పెడుతున్నా వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌ విరుసుతున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా అందినకాడికి దోచుకెళుతున్నారు. దీంతోప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నెల్లూరు నగరం వేదాయపాళెంలోని ఓ మొబైల్‌ షోరూంలో చోరీ జరగడం కలకలం రేపింది.

సాక్షి, నెల్లూరు:  జిల్లాలో 22 సర్కిల్స్‌ పరిధిలో 64 పోలీసుస్టేషన్లున్నాయి. నెల్లూరు నగరంలో ఆరు పోలీసుస్టేషన్లు, క్రైమ్‌ స్టేషన్‌ ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా స్టేషన్ల పరిధిలో నిఘా వ్యవస్థ పెరిగింది. పగలు, రాత్రి అనే తేడాలేకుండా సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పాతనేరస్తులు, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెంచారు. ప్రతిరోజూ రాత్రి ఆయా స్టేషన్ల పరిధిలో పాతనేరస్తులు, రౌడీషీటర్లను సిబ్బంది నేరుగా కలుసుకుని వారి వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి నేరస్తు ఆట కట్టిస్తున్నారు. అంతేకాకుండా అనేక చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేసి పెద్దఎత్తున చోరీసొత్తును రాబడుతున్నారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేసి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వరుసగా జరుగుతున్న చోరీలపై పోలీసుశాఖ ఇంకా అప్రమత్తం కావాలన్న సూచన సర్వత్రా వినిపిస్తోంది.

సవాల్‌ విసురుతున్న చోరులు 
పోలీసు చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి అనుకుంటుండగానే వరుస చోరీలతో దొంగలు పేట్రేగిపోతున్నారు. యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌ విసరుతున్నారు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేయడమే కాదు.. ఇళ్లలో ఉన్నవారిని, రహదారులపై వెళుతున్న వారిని సైతం బెదిరించి దోపిడీలకు పాల్పడుతూ అందినకాడికి దోచేస్తున్నారు. ప్రయాణికుల ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్నారు.

సహకారం తప్పనిసరి
ఇళ్లు విడిచి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) సేవలను వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఇళ్లలో విలువైన ఆభరణాలు, నగదు ఉంచరాదు. వాటిని బంధువుల వద్దనో బ్యాంకు లాకర్లలోనో భద్రపరచాలి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు తారసపడితే వెంటనే సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించాలి.

సెల్‌ఫోన్ల చోరీలు పెరిగాయ్‌
జిల్లాలో సెల్‌ఫోన్ల చోరీలు పెరిగాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సినిమా హాళ్లలో ఎవరైనా ఆదమరిచి ఉంటే చాలు.. చోరులు క్షణాల్లో వారి ఫోన్లను తస్కరించి మాయమవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దొంగలించిన ఫోన్లను ఇతర ప్రాంతాల్లో అమ్మివేయడమో లేక సిమ్‌ మార్చివేసి వినియోగించడమో చేస్తున్నారు.

కొన్ని ఘటనలు..
ఈ ఏడాది మేలో సైదాపురంలో ఓ మహిళ కంట్లో కారంపొడి చల్లి 12 సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారు. 
జూన్‌లో వెంకటాచలం అటవీ ప్రాంతంలో మధు అనే వ్యక్తిని కత్తులతో బెదిరించి రూ.18 వేలు నగదు దోచుకెళ్లారు. 
జూలైలో ఇందుకూరుపేట మండలం మైపాడులో ఓ ఇంట్లో దొంగలు పడి రూ.10 లక్షల నగదు, రూ.3 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. 
వెంకటాచలం మండలం కాకుటూరు శివాలయంలో దొంగలు పడి రూ 2.07 లక్షలు విలువచేసే సొత్తు అపహరించారు.
నగరంలోని బాలాజీనగర్‌లో ఓ ఇంట్లో దొంగలు పడి 33 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 
నెల్లూరు రవీంద్రనగర్‌లోని ఓ ఇంట్లో దొంగలు పడి ఏడు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
ఇందుకూరుపేట మండలం కొత్తూరులో ఓ ఇంట్లో దొంగలు పడి ఎనిమిది సవర్ల బంగారు నగలు చోరీ చేశారు.
కోవూరు శాంతినగర్‌లో ఓ ఇంట్లో దొంగలు పడి రూ.లక్ష నగదు, 10 సవర్ల బంగారు ఆభరణాలు దొంగతనం చేశారు.
వేదాయపాళెం పోలీసుస్టేషన్‌ పరిధిలో రెండురోజుల్లో నాలుగుచోట్ల 32 సవర్ల బంగారు గొలుసులు అపహరించుకుపోయారు. 
జీజీహెచ్‌లో వైద్యం కోసం వచ్చిన ఓ వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి 8.5 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. 
తాజాగా పొదలకూరు మండలం పార్లపల్లిలో భారతి అనే మహిళను చంపుతామని బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న ఏడుసవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.

మరిన్ని వార్తలు