రైతు నోట్లో ‘మట్టి’

25 Jul, 2015 02:47 IST|Sakshi
రైతు నోట్లో ‘మట్టి’

- తుంగభద్ర డ్యాంలో పెరిగిపోతున్న పూడిక
- భారీ స్థాయిలో తగ్గిన నీటి నిల్వ
- పూడిక తీయాలంటే భారీ వ్యయం
అనంతపురం ఇరిగేషన్ :
మట్టిని నమ్ముకుని బతికేవాడు రైతు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అదే మట్టి రైతుకు మరో రూపంలో కీడు కూడా చేస్తోంది. అనంతపురం జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్న తుంగభద్ర డ్యాంలో ఏడాదికేడాదికి పూడిక భారీ స్థాయిలో పెరుగతూ వస్తోంది. పూడిక ఎక్కువగా పేరుకుపోవడంతో డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం భారీ స్థాయిలో తగ్గిపోతోంది. ప్రారంభంలో 220 టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యాం ప్రస్తుతం 100 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకోగలుగుతోంది.

ఈ ఉదాహరణ చాలు ఏ స్థాయిలో పూడిక చేరుకుంటుందో అర్థం చేసుకోవడానికి. తుంగభద్ర డ్యాంలో ఆంధ్రప్రదేశ వాటా 32.5 టీఎంసీల ఉండగా.. పూడిక పేరుకుపోవడంతో గత ఏడేళ్లుగా సగటున 22 టీఎంసీలు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్క టీఎంసీతో ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చు. ఈ సగటున మన రాష్ట్రం 80 వేల ఎకరాలకు సరిపడా నీటిని కోల్పోతోంది. మరీ ముఖ్యంగా తుంగభద్ర జలాలపైనే ఆధారపడిన అనంతపురం జిల్లా పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పూడిక పేరుకుపోవడంతో అనంతపురం జిల్లాలో 60 వేల ఎకరాలకు నీరు అందించలేకపోతున్నట్లు ఇంజనీరింగ్ అధికారుల అంచనా.
 
భారీ వ్యయం: డ్యాంలలో పూడిక తీయాలంటే భారీ వ్యయం అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మన దేశంలో పూడిక తీయడానికి ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ, కాలువల్లో (కెనాల్స్) మాత్రమే తీయడానికి సాధ్యమవుతోంది. కాలువల్లో అయితే తీసిన పూడికను గట్టులపై వేయవచ్చు. అదే డ్యాంలో అయితే వెడల్పు ఎక్కువగా ఉండటంతో పూడిక ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి. మన రాష్ర్టంలో గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రధాన కాలువలో పూడిక తీయడం జరిగింది.

అయితే అక్కడ కాలువకు ఇరువైపులా అటవీ భూమి ఉండటంతో పూడిక అక్కడ వేశారు. అదే తరహాలో డ్యాంలో కూడా ఇరుపైపుల పూడిక తీయడానికి వీలు ఉన్నప్పటికీ, డ్యాం మధ్య భాగంలోని పూడికను తొలగించడం అసాధ్యంగా మారింది. మధ్య భాగంలోని పూడికను తొలగించాలంటే భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. అదే డబ్బుతో మధ్య స్థాయి ప్రాజెక్టునే నిర్మించవచ్చునన్నది అధికారులు అభిప్రాయం. కొన్ని దేశాల్లో డ్యాం నిర్మించేటప్పుడు డ్యాంలోకి నీరు చేరే పది, పదిహేను కిలోమీటర్ల ముందే చెక్‌డ్యాం తరహాలో గోడను నిర్మిస్తారు. దీనితో పూడిక అక్కడే నిల్వ అవుతుంది. డ్యాంలోకి నీరు మాత్రమే చేరుతుంది. మనదేశంలో ఎక్కడా అలా జరగనందున డ్యాంలోకి పూడిక ఎక్కువగా చేరుకుంటోంది.
 
ఏమీ చేయలేని పరిస్థితి : ప్రతి ఏడాది తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చ జరుగుతున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. డ్యాంలో 120 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోలేక పోతున్నాం. పూడిక తీయాలంటే భారీ వ్యయం ఒక కారణం అయితే, తీసిన పూడికను ఎక్కడికి తరలించాలన్నది మరో సమస్య. దీంతో పూడిక తీయడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు.   -  శేషగిరిరావు, హెచ్చెల్సీ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు