బాని‘సెల్‌’ కావొద్దు..

10 Jul, 2019 08:13 IST|Sakshi

విపరీతంగా పెరిగిన మొబైల్‌ వాడకం

బాలలపై తీవ్ర ప్రభావం

సెల్‌ మత్తులో యువత

పెరుగుతున్ననేర ప్రవృత్తి

నేడు సెల్‌ఫోన్లు లేని జీవితాన్ని ఊహించుకోలేం. 20 ఏళ్ల క్రితం ధనికుల ఇళ్లలో ఒక ల్యాండ్‌ఫోన్‌ ఉండటమే గొప్పగా భావించేవారు. ప్రస్తుతం దినసరి కూలీ వద్ద కూడా ఒకటికి మించిన ఖరీదైన ఫోన్లు ఉండటం మామూలైంది. మూడేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల యువత వరకు సెల్‌ఫోన్‌ ఆరోగ్యం, చదువు, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆధునికీకరణ పేరుతో జరుగుతున్న ఈ సామాజిక నష్టాన్ని వారించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ప్రయత్నించాలని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

కడప కల్చరల్‌/ ప్రొద్దుటూరు క్రైం: ప్రస్తుతం మూడేళ్ల చిన్నారి కూడా సెల్‌ఫోన్‌ చూస్తున్నారు. ఇంట్లో స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులో ఉండటం.. అందులోని రంగులు, బొమ్మలు వారిని ఆకర్షిస్తుండటంతో పిల్లలు సెల్‌ఫోన్‌ దొరికితే గంటల కొద్ది ఆడుకుంటున్నారు. పెద్ద పిల్లలు సెల్‌ఫోన్లతో మరింత ఎక్కువ సమయం గడుపుతున్నారు. మొండికేసి, అలకబూని పెద్దలను బ్లాక్‌మెయిల్‌ చేసి మరీ స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పించుకుంటున్నారు. పెద్దలకు ఇచ్చిన మాటను తప్పి స్కూళ్లలో ఖాళీ సమయాల్లో కూడా సెల్‌ఫోన్‌తో గడుపుతున్నారు. కొందరు తరగతుల్లో వెనుకవైపు కూర్చొని సైలెన్స్‌లో పెట్టి మరీ ఫోన్‌తో వినోదిస్తున్నారు.

యువత కూడా అంతే..
ఎప్పటికప్పుడు మారుతున్న లేటెస్ట్‌ రకాల ఫోన్లు లేకుంటే నేటి యువతకు గడిచేటట్టు లేదు. కనీసం రెండు స్మార్ట్‌ ఫోన్లు లేకుంటే బతకలేమన్నట్లుగా భావిస్తున్నారు. తెల్ల వారుజాము నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా సెల్‌ఫోన్‌ను వాడుతూనే ఉన్నారు. ఇందులో అశ్లీల వెబ్‌సైట్లనే ఎక్కువ చూస్తుంటారని ఓ సర్వేలో తేలింది. యువత కూడా దాన్ని అంతగా ఖండించేందుకు ప్రయత్నించడం లేదు. వారి కెరీర్‌కు సంబంధించి ఉపయోగకరంగా ఉంటుందని పెద్దలు స్మార్ట్‌ ఫోన్లు కొనిస్తే యువకుల్లో ఎక్కువ శాతం మంది ఫోర్న్‌ సైట్లలోనే గడుపుతుంటారని సమాచారం.

దీంతో వారి ఆలోచన తీరులో మార్పు రావడం.. నైతిక, సామాజిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. తొమ్మిది నెలల చిన్నారి నుంచి 90 ఏళ్ల వృద్ధులైన మహిళల వరకు లైంగిక దాడులకు గురి కావడం స్మార్ట్‌ ఫోన్ల ప్రభావం 50 శాతానికి పైగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రాకముందు ఇలాంటి క్రైమ్‌ రేట్‌ ఐదు శాతానికి మించి ఉండేది కాదని, ›ప్రస్తుతం అది తారాస్థాయికి చేరిందని పోలీసుల రికార్డులు తెలియజేస్తున్నాయి. కుటుంబ పెద్దలైన తల్లిదండ్రులు సెల్‌ఫోన్ల వాడకం విషయంలో.. యువత కంటే 60 శాతం తక్కువే అయినా పురుషుల కంటే స్త్రీలే ఫోన్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది. 

ఆరోగ్యంపై ప్రభావం
సమయం వృథా, విలువల సంగతి అటుంచితే.. స్మార్ట్‌ ఫోన్లు ప్రజల ఆరోగ్యం, జీవితాలపై చూపుతున్న దుష్ప్రభావం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా యువత అర్ధరాత్రి వరకు చాటింగ్‌ చేస్తుండటంతో నిద్రకు దూరమై క్రమంగా అనారోగ్యం పాలవుతున్నారు. యువతకు చాటింగ్‌ ఓ వ్యసనంగా మారింది. ఫలితంగా చదువు కుంటుపడుతోంది. అసహనం పెరగడంతో ఆలోచన కోల్పోతున్నారు. లక్ష్య సాధన దిశగా విఫలమవుతున్నారు. పగలంతా రొటీన్‌ పనులతో అలిసిపోయినపుడు మనిషికి గంటసేపు నిద్ర కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. నిజానికి మన శరీరానికి తగినంత విశ్రాంతి ఉన్నప్పుడే తిరిగి పని చేసేందుకు నూతన శక్తి లభిస్తుంది.

మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ అధికంగా ఉండే విద్యార్థి దశలో బాలలకు తగిన నిద్ర ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. చదివింది గుర్తుండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. పరీక్షల సమయంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. కానీ నేటి యువత సామాజిక మాధ్యమాలతో పగలు, రాత్రి బిజీ అవుతూ నిద్రలేమితో బాధపడుతున్నారు. యువతతోపాటు మిగతా వయసుల వారు కూడా స్మార్ట్‌ఫోన్‌తో అర్ధరాత్రి వరకు గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాలతో సమాజానికి మంచితోపాటు చెడు కూడా ఎక్కువగా జరుగుతోంది. సోషల్‌ మీడియా ద్వారా పిల్లలు మంచి కంటే చెడే ఎక్కువగా నేర్చుకుంటున్నారని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేలాది మందిలో ఒంటరై..
స్మార్ట్‌ ఫోన్లలో ఎక్కువ యాప్స్‌తో గడుపుతుండటంతో యువత, బాలలకు చుట్టుపక్కల పరిస్థితులను గమనించే స్థితి పోతుంది. చుట్టూ తెలిసిన వారు, స్నేహితులున్నా వారిని కూడా పట్టించుకోకుం డా ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ పరిసరాలు మరిచిపోతున్నారు. వయసు, హోదా, స్థాయి భేదం లేకుండా ఇప్పుడు పదేళ్ల వయసు బాలల నుంచి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్‌ కనిపిస్తోంది. ఇం టర్నెట్‌ ప్యాకేజీల ధర భారీగా తగ్గడంతో.. రోజంతా అన్నీ లిమిటెడ్‌గా స్మార్ట్‌ ఫోన్‌తో గడుపుతున్నారు. ఫేస్‌బుక్‌లో లైకులు, కామెంట్లు ఫ్యాషన్‌గా మారాయి. నాలుగు గోడల మధ్య అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్‌తోనే గడుపుతూ నిద్రకు దూరమవుతున్నారు.

రాత్రిళ్లు ఎంత ఆలస్యంగానైనా పడుకుంటారు గానీ ఉదయాన్నే నిద్రలేవడం మాత్రం తమ చేతుల్లో లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. రోజంతా కష్టపడి ఉదయం త్వరగా నిద్రలేస్తే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుం దని వైద్యులు చెబుతున్నా.. ఈ తరం మనుషులు ఆ ధ్యాస వదిలేసి నిరంతరం సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. మన దేశంలో పదేళ్ల వయసు నుంచి పాతికేళ్లలోపు వారు రోజూ ఐదు గంటలపాటు స్మార్ట్‌ ఫోన్‌తో గడుపుతున్నట్లు ఆరోగ్య నిపుణుల అంచనా. సెల్‌ఫోన్‌ తక్కువగా వాడితే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల సెల్ఫీలు ఫ్యాషన్‌గా మారడంతో ప్రమాదకరమైన సన్నివేశాలను ఫోన్లలో బంధించాలన్న ఆవేశంతో ముఖ్యంగా యువకులు ప్రాణాలను కోల్పోతున్నారు.

తల్లిదండ్రులు మేల్కోవాలి
చిన్నారులు, విద్యార్థులు సెల్‌ గేమ్‌లలో మునిగిపోకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆడే ఆటలు చాలా ఉన్నాయని, ఇలాంటి గేమ్‌ల జోలికి పోవద్దని సున్నితంగా చెప్పాలి.
పాశ్చాత్య సంస్కృతిలో అందుబాటులో వచ్చిన వీడియో గేమ్‌ల వల్ల కలిగే అనర్థాలను వివరించాలి.
సాధ్యమైనంత వరకు అత్యవసరమైతే తప్ప మొబైల్‌ డేటా వేయకపోవడమే మంచిది.
పిల్లల అభిరుచులు, అలవాట్లను గౌరవిస్తూనే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి అవుట్‌డోర్‌ క్రీడల్లో ప్రోత్సహించాలి. దగ్గరుండి పిల్లలను తీసుకొని వెళ్లాలి.
రోజూ శారీరక వ్యాయామం చేయించడం, శారీరక అలసట ఉండే క్రీడల్లో ప్రోత్సహించాలని వైద్యులు చెబుతున్నారు.

ప్రమాదకరం
సెల్‌ఫోన్‌లలో గేమ్‌లు ఆడటం చాలా ప్రమాదకరం. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, కలుపుగోలుతనం లేకపోవడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా కంటి జబ్బులు వస్తాయి. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరు

సమయం వృథా
మానవాభివృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం ఇదే స్థాయిలో వారి మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. వయసు, లింగ భేదాలు తేడా లేకుండా అందరినీ అంధకారంలోకి నెట్టివేస్తోంది. ఆన్‌లైన్‌ గేమ్‌లతో ఎంతో విలువైన సమయానికి నిర్ధాక్షిణ్యంగా వృథా చేసుకుంటున్నారు. గంటల తరబడి సెల్‌ఫోన్‌ చూడటం వల్ల వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా