నేడే త్రివర్ణోదయం

14 Aug, 2015 23:44 IST|Sakshi
నేడే త్రివర్ణోదయం

కాంతులీనుతున్న మహానగరం
సాగరతీరంలో మువ్వెన్నల రెపరెపలు
విద్యుత్‌దీపాలతో దేదీప్యమానంగా నాటి కట్టడాలు


విశాఖపట్నం: మహానగరం మరో చారిత్రాత్మక  ఘట్టానికి వేదికవుతుంది. బ్రిటిష్ సంకెళ్ల నుంచి భారతావనికి విముక్తి కల్పించేందుకు జరిగిన అలనాటి స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన విశాఖపట్నం మరోసారి నాటి స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ మహా పండుగకు ముస్తాబైంది. తొలిసారిగా రాష్ర్ట స్థాయి వేడుకలు జరుగుతుండడంతో మహానగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా యంత్రాంగం నెల రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తూ ఏర్పాట్లు చేసింది. అల్పపీడన ప్రభావంతో రెండురోజుల క్రితం కుండపోతగా వర్షం కురియడంతో యంత్రాంగం ఆందోళనకు గురైంది. వేదికతో పాటు వీక్షకులకు సైతం రెయిన్‌ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు.  50వేల మందికి పైగాప్రజలు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఏడు వర్గాలుగా విభజించి వేదికకు ఇరువైపులా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. బీచ్‌రోడ్‌తో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో పది ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. నగరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.

నగరంలో పండుగ వాతావరణం: నగరమంతా  జెండా పండుగ వాతావరణం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వెయ్యి మీటర్ల భారీ మువ్వెన్నల పతాకంతో గురువారం మర్రిపాలెం-కరచా వరకు ప్రదర్శించగా, శుక్రవారం స్టూడెంట్స్ యునెటైడ్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో 830 మీటర్ల పతాకాన్ని వైఎస్సార్ సెంట్రల్ పార్కు చుట్టూ ప్రదర్శిం చారు. పూర్ణామార్కెట్‌లో చేయూత ఫౌండేషన్, శ్రీవిష్ణు స్కూల్  సౌజన్యంతో 100 మీటర్ల త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించారు. రెస్టారెంట్లు, హోటల్స్, విద్యాలయాల్లో ఇండిపెండెన్స్‌డే సెలబ్రేషన్స్‌కు ముస్తాబయ్యాయి. రేడియోమిర్చి ఆధ్వర్యంలో సిరిపురం జంక్షన్ నుంచి బీచ్‌రోడ్ వరకు ఇండిపెండెన్స్ డే వాక్ నిర్వహించారు.
 నేడు మూడు కొత్త పథకాల ప్రకటన: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాత్రికి విశాఖకు చేరుకున్నారు. సర్క్యూట్ హౌస్‌లో బస చేయనున్న సీఎం శనివారం ఉదయం సరిగ్గా 8.50 గంటలకు బయల్దేరి గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. 9 గంటలకు జెండా ఆవిష్కరణ అనంతరం గౌరవవందనం స్వీకరిస్తారు. పెరెడ్, శకటాల ప్రదర్శన, అవార్డుల ప్రదానం తర్వాత ప్రసంగించనున్న సీఎం మూడు కొత్త పథకాలను ప్రకటించనున్నారు. అలాగే విశాఖ నగర వాసుల దీర్ఘకాలిక సమస్యయిన ఇళ్ల పట్టాల సమస్యపై ప్రకటన చేయనున్నారు. వంద గజాల్లోపు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న నిరుపేదలకు ఉచితంగా క్రమబద్దీకరిస్తూ పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రకటించనున్నారు.

 పాస్‌లపై వివాదం: కాగా రాష్ర్ట స్థాయిలో వెయ్యి మంది ఉన్నతాధికారులు, వీవీఐపీలకు జీఓడీయే ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేయగా, జిల్లా స్థాయిలోని మరో 1500 మంది ప్రజాప్రతి నిధులు, అధికారులు, అనధికారులకు జిల్లా ప్రోటోకాల్ విభాగం పాస్‌లు జారీ చేసింది. అయితే సామర్ధ్యానికి మించి పాస్‌లు జారీ చేశారనే విమర్శలు విన్పించాయి. నిర్ధేశించిన ఏడు కేటగిరిల్లో కూర్చునేందుకు మాత్రమే పాస్‌లు జారీ చేయాల్సి ఉండగా, నిల్చొని వీక్షించేందుకు కూడా పెద్దఎత్తున పాస్‌లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పాస్‌ల కోసం పెద్దఎత్తున పైరవీలు కూడా కొనసాగాయి.
 
 

మరిన్ని వార్తలు