త్రివర్ణం.. వివర్ణం!

14 Aug, 2018 13:33 IST|Sakshi
బి.నరసింహులు, హెచ్‌ఎం, రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌

జెండాపండుగ.. జేబులు ఖాళీ

పాఠశాలల ఖాతాల్లో ‘0’ బ్యాలెన్స్‌

నిధులు లేక అల్లాడుతున్న హెచ్‌ఎంలు

పిల్లల చాక్లెట్లకూ దిక్కులేదు

కళ తప్పనున్న స్వాతంత్య్ర దినోత్సవం  

రేపు స్వాతంత్య్ర దినోత్సవం. కార్పొరేట్‌..ప్రైవేటు స్కూళ్లలో చిన్నారులకు ఆటలపోటీలు, సాంస్కృతి పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు మువ్వన్నెల పండుగ రోజు బహుమతులిచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. కానీ సర్కారు స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు మాత్రం జేబులు తడుముకుంటున్నారు. పాఠశాలల ఖాతాల్లో రూపాయి కూడా లేకపోవడంతో చిన్నారుల నోరు తీపి చేసేందుకు కూడా డబ్బుల్లేక ఆలోచనలో పడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకోనివ్వని అసమర్థ సర్కారుపై మండిపడుతున్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఏటా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ కోసం స్కూల్‌ గ్రాంటు విడుదలవుతుంది. పాఠశాల మెయింటెనెన్స్‌ గ్రాంటు, స్కూల్‌ కాంప్లెక్స్‌ గ్రాంటుల పేరుతో పాఠశాల స్థాయిని బట్టి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కొత్తగా రూపాయి కూడా విడుదల చేయలేదు. పైగా గతంలో మంజూరు చేసిన నిధులనూ వెనక్కు తీసుకుంది. దీంతో ఖాతాలన్నీ ఖాళీ కాగా ప్రధానోపాధ్యాయుల జేబుకు చిల్లు పడుతోంది. 

రూ.10.56 కోట్లు వెనక్కు
జిల్లాలో 2,773 ప్రాథమిక, 590 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,933 పాఠశాలలున్నాయి. స్టేషనరీ, రిజిస్టర్లు, క్వశ్చన్‌ పేపర్లు, చాక్‌పీస్, డస్టర్, లైబ్రరీ పుస్తకాలు కొనుగోలుకు స్కూల్‌ గ్రాంట్, కరెంటు బిల్లుల చెల్లింపు, చిన్నచిన్న మరమ్మతులు, స్పోర్ట్స్‌ మెటీరియల్‌ కొనుగోలుకు నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం ఏటా విడుదల చేస్తోంది. రెండు గ్రాంట్లు కలిపి ప్రాథమిక పాఠశాలలకు రూ. 10 వేలనుంచి రూ.15 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.22 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.  17 వేలు జమ చేయాల్సి ఉంది. ఇదికాకుండా స్కూల్‌ కాంప్లెక్స్‌ గ్రాంటు కింద ఒక్కో కాంప్లెక్స్‌కు రూ. 22 వేలు మంజూరు చేయాల్సి ఉంది. 2017–18 విద్యా సంవత్సరంలో స్కూల్‌ గ్రాంటు తప్ప... మిగతా ఏ నిధులూ జిల్లాకు విడుదల కాలేదు. మరోవైపు ఎస్‌ఎంసీ ఖాతాల్లో ఉన్న రూ. 10.56 కోట్లు నిధులనూ 15 రోజుల కిందట ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీంతో స్కూళ్ల ఖాతాలన్నీ ‘0’ బ్యాలెన్స్‌ చూపిస్తున్నాయి.

మురిగిపోయిన రూ.3 కోట్లు
ఎస్‌ఎస్‌ఏ అధికారుల అలసత్వం.. రాష్ట్ర అధికారులు పట్టింపులేనితనం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారింది. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘పాఠశాలల నిర్వహణ నిధులు’ రూ. 3 కోట్లు రావాల్సి ఉండగా.. పైసా కూడా కేటాయించలేదు. మూడు గదులున్న పాఠశాలకు ఏడాదికి రూ. 5 వేలు, నాలుగు అపైన గదులున్న పాఠశాలలకు రూ. 10 వేలు నిర్వహణ నిధులు మంజూరు చేయాల్సి ఉంది. వీటిని మరుగుదొడ్లు నిర్వహణ, కొళాయిలు, కిటీకీలు, వాకిళ్ల మరమ్మతు, వైట్‌వాష్, కరెంటు బిల్లులు, కంప్యూర్ల మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఎస్‌ఎస్‌ఏ అధికారులు పంపిన తుది ప్రణాళికలో ‘పాఠశాల నిర్వహణ నిధుల’ కాలం ఖాళీగా పంపడం కొంప ముంచింది. 

పట్టించుకోని ప్రభుత్వం
పాఠశాలల నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం ప్రస్తుతం కనీసం చాక్‌పీస్‌ కొనేందుకు డబ్బులు లేక అల్లాడుతున్నా... పట్టించుకోవడం లేదని హెచ్‌ఎంలు వాపోతున్నారు. కనీస అవసరాలకు ఉపయోగించాల్సి నిధులను చెప్పాపెట్టకుండా వెనక్కు తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

నిర్వహణ కష్టమే..
స్కూల్‌ ఖాతాల్లోని నిధులను వెనక్కు  తీసుకున్న ప్రభుత్వం.. కొత్త నిధులు విడుదల చేయకపోవడం అన్యాయం. మౌళిక వసతులతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయిస్తేనే నిర్వహణ ఇబ్బందిగా ఉంది. నిధులన్నీ తీసేసుకుంటే పాఠశాలల పరిస్థితి ఏం కావాలి. చాక్‌పీసులు కొనేందుకూ డబ్బు లేకపోతే ఎలా..?– బి.నరసింహులు,హెచ్‌ఎం, రాప్తాడుజెడ్పీహెచ్‌ఎస్‌

మరిన్ని వార్తలు