సాగర తీరంలో స్వాతంత్య్రదిన వేడుకలపై సమీక్ష

5 Aug, 2015 20:37 IST|Sakshi

విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా విశాఖ సాగర తీరంలో నిర్వహిస్తున్న స్వాతంత్య్రదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి (పొలిటికల్) ముకేష్‌కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బుధవారం విశాఖ నగరంలో పర్యటించారు. తొలుత వేడుకలు నిర్వహించనున్న బీచ్‌రోడ్డు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో కలసి ఏర్పాట్లను సమీక్షించారు. విశాఖలో తొలిసారిగా జరుగుతున్న రాష్ర్ట స్థాయి స్వాతంత్య్ర వేడుకలను చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

సీఎం చంద్రబాబు సహా సుమారు వెయ్యి మందికి పైగా వీఐపీలు, వీవీఐపీలు పాల్గోనున్న ఈ మహా వేడుకలో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదన్నారు. ప్రజలందరూ ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రతాపరంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తెలిపారు. ఈ సమీక్షలో జేసీ జే.నివాస్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకుడు డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు