స్వతంత్రులతో కలవరం

4 Apr, 2019 11:44 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక సమరం కీలక దశకు చేరుకుంది. పోరులో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ప్రధాన పార్టీల మధ్యే పోరు సాగుతున్నా, బరిలో మాత్రం సగానికిపైగా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జిల్లాలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఈ ఇండిపెండెంట్‌ అభ్యర్థులు.. తాము ఏ విషయంలో తగ్గేది లేదన్నట్టుగా.. ముందుకెళుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం తగ్గని రీతిలో.. ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీరు చీల్చే ఓట్ల ప్రభావం ఎవరిపై పడుతుందోననే ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది.

జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీ స్థానాలకు 205 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో సింహభాగం ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులే ఉన్నారు. వీరిలో ఇతర పార్టీల అభ్యర్థులు, టీడీపీ నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బదీసేందుకు స్వతంత్రులను రంగంలోకి దించారన్న ప్రచారమూ సాగుతోంది.

బందరు, అవనిగడ్డ, ఇలా అన్ని ప్రధాన నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్, జనసేనతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నలుగురు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు చీల్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

కొత్త చిక్కు..
2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌ సీపీ మధ్య పోరు సాగింది. ప్రస్తుతం రంగంలోకి జనసేన రావడంతో ఏ పార్టీ ఓట్లు చీల్చుతుంది? మూడో పార్టీ రంగ ప్రవేశంతో ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న చర్చ నడుస్తున్న తరుణంలో స్వతంత్రుల పోరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మరో చిక్కు తెచ్చిపెట్టినట్లయింది. చీల్చేవి తక్కువ ఓట్లయినా రసవత్తర యుద్ధంలో కొన్సిసార్లు అవే కీలకంగా మారే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి.  

పార్లమెంట్ల పరిధిలో..

  • బందరు పార్లమెంట్‌ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 12 మంది బరిలో ఉండగా.. అందులో 4 ఇండిపెండెంట్లు, మరో 4 రిపబ్లికన్, పిరమిడ్‌ తదితర పార్టీలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారు వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.  
  • విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో 15 మంది బరిలో ఉండగా.. 5 ఇండిపెండెంట్లు, 5 మంది పిరమిడ్, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ తదితర పార్టీలకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు ప్రధాన పార్టీల అభ్యర్థులున్నారు. 

అసెంబ్లీ పరిధిలో.. 

  • తిరువూరు నియోజకవర్గంలో 12 మంది బరిలో ఉండగా.. అందులో 4 ఇండిపెండెంట్లు, 3 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీలకు చెందిన వారు బరిలో ఉన్నారు. 
  • నూజివీడులో 11 మంది పోటీలో ఉండగా.. 3 ఇండిపెండెంట్లు, 4 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీల తరఫున బరిలోకి దిగుతున్నారు. 
  • గన్నవరంలో 14 మంది బరిలోకి దిగగా.. 4 ఇండిపెండెంట్లు, 4 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ టీడీపీ గిమ్మిక్కు రాజకీయాలకు దిగింది. వైఎస్సార్‌ సీపీ యార్లగడ్డ వెంకట్రావు పేరును పోలిన పేరుతో ప్రజాశాంతి పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రామయ్యను రంగంలోకి దింపి వైఎస్సార్‌ సీపీ ఓట్లను చీల్చే కుట్ర పన్నుతోంది. 
  • గుడివాడలో 12 మంది అభ్యర్థులుండగా.. 6 మంది ఇండిపెండెంట్లు, 1 ఇతర పార్టీ, మిగిలినవి ప్రధాన పార్టీలకు చెందిన వారు కాగా.. ఇక్కడ కూడా టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు దిగింది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నానీ) పేరును పోలిన వెంకటేశ్వరరావు కొడాలి అభ్యర్థిని ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలోకి దింపుతోంది. 
  • కైకలూరులో 14 మంది బరిలో ఉండగా..6 మంది స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు ఇతర పార్టీ, మిగిలిన వారు ప్రధాన పార్టీల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
  • పెడనలో 9 మంది పోటీలో ఉండగా 2 స్వతంత్ర, 3 ఇతర, మిగిలిన వారు ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగుతున్నారు. మచిలీపట్నంలో 8 మంది బరిలో ఉండగా.. ఒక్క స్వతంత్ర అభ్యర్థి, 1 ఇతర, మిగిలినవి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. 
మరిన్ని వార్తలు