గాంధీతో ప్రయాణం మరువలేను

15 Aug, 2019 15:07 IST|Sakshi

సాక్షి, నందనవనం : బానిస సంకెళ్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించే సమరంలో పాలుపంచుకున్న అనుమాల అశ్వద్ధనారాయణ అలనాటి జ్ఞాపకాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన అశ్వద్ధ నారాయణ 1942వ సంవత్సరంలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. భార్య లక్ష్మమ్మ, కుమారుడు దినేష్‌ ఉన్నారు. అశ్వద్ధనారాయణ బీఏ, లా చదివే సమయంలో ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. నెల్లూరు సమీపంలో రైలు పట్టాలు తొలగించిన కేసులో బ్రిటిష్‌ పాలకులు అరెస్టు చేసి బళ్లారి జైల్లో ఖైదు చేశారు.

1946లో నెల్లూరు నుంచి చెన్నై వరకు గాంధీజీతో రైలులో ప్రయాణించానని, ఆ అనుభవం తాను ఎన్నటికీ మరువలేనంటున్నారాయన. గాంధీజీని అంత దగ్గరగా చూస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. తన 20 ఎకరాల పొలాన్ని స్వాతంత్య్ర ఉద్యమం కోసం విక్రయించగా ప్రస్తుతం 2 ఎకరాలు మాత్రమే మిగిలింది. కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నిర్మాణానికి తన సొంత స్థలం దానంగా ఇచ్చి నిధులు ఖర్చు చేశారు. నేటికీ ఆయన పేరు పాఠశాల శిలాఫలకంపై ఉంది. ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి అశ్వద్ధ నారాయణకు ఆహ్వాన పత్రం అందింది. అయితే అనారోగ్య కారణాల వల్ల తన తండ్రి ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని కుమారుడు దినేష్‌ వివరించారు. దినేష్‌ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు