భారత్ ఎట్ హైబీపీ

19 Oct, 2013 23:49 IST|Sakshi
భారత్ ఎట్ హైబీపీ


అధిక రక్తపోటుతో దేశవ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది మృతి
 
 సాక్షి, హైదరాబాద్ అధిక రక్తపోటు భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. ఎక్కువ మంది మృతికి కారణమవుతున్న జబ్బుల్లో ఇది రెండో స్థానంలో ఉంది. దీన్ని నియంత్రించకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. హైబీపీ కారణంగా లక్షలాది మంది మృతి చెందుతున్నారు. లక్షలాది మంది శాశ్వత వైకల్యం పాలవుతున్నారు. దీనిపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు నేషనల్ బ్రెయిన్ స్ట్రోక్ రిజిస్ట్రీ కన్వీనర్, సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజీ) లూథియానా న్యూరో విభాగాధిపతి డా. జయరాజ్ పాండియన్. బ్రెయిన్ స్ట్రోక్ మీద హైదరాబాద్‌లో జరిగిన రెండ్రోజుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అవి ఆయన మాటాల్లోనే..
 
 ఉప్పువల్లే ముప్పు
 
 

మన దేశీయులు ఉప్పు ఎక్కువగా వాడుతున్నారు. ఇందువల్లే ఎక్కువ మంది అధిక రక్తపోటు(హైబీపీ) బారిన పడుతున్నారు. మనిషికి రోజుకు 4 లేదా 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. కానీ 15 నుంచి 20 గ్రాములు వాడుతున్నారు.  ఆహారంలో ఉప్పుతో పాటు అధికంగా కొవ్వు పదార్థాలు తినడం, పొగ తాగడం, మద్యపానం, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ (మెదడులో నరాలు చిట్లిపోవడం) వస్తోంది.
 
 రాష్ట్రంలో కేసులు ఎక్కువే
 
  నాలుగైదేళ్లుగా దేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువయ్యాయి. ఏటా 15 లక్షల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. 4 లక్షల మందికి పైగా మృతి చెందుతున్నారు. 7 లక్షల మంది వైకల్యానికి గురవుతున్నారు. ఇవి ప్రాథమిక గణాంకాలు మాత్రమే. ఇంకా ఎక్కువ కేసులు నమోదై ఉండొచ్చు. నిమ్స్ సహా దేశవ్యాప్తంగా 10 కేంద్రాల్లో బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం కేసుల వివరాలను పక్కాగా నమోదు చేయడం త్వరలో ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లో ఏటా లక్ష మందిలో 148 మందికి బ్రెయిన్‌స్ట్రోక్ వస్తోంది. మిగతా నగరాలతో పోల్చుకుంటే ఇది ఎక్కువే. ఈ కేసుల్లో 65 శాతం పట్టణాల్లో, 35 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఈ స్ట్రోక్ 45 ఏళ్ల లోపు వారికే వస్తూండటం ప్రమాద సూచిక. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారికి తొలి 4 గంటల్లోగా సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయం నుంచి, వైకల్యం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది.
 
 నియంత్రణ సాధ్యమే
 
 ఉప్పు వాడకం బాగా తగ్గించుకోవాలి, కొవ్వులను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. ముఖ్యంగా పొట్టేలు మాంసం తినడం తగ్గించాలి. నూనెలో వేపిన మాంసాహారం వాడకాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించుకోవాలి. రోజూ కనీసం 40 నిమిషాలు వేగంగా నడవాలి.. ఇలా చేయడం ద్వారా హైబీపీని అదుపు చేయొచ్చు. యోగాతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు