ఉన్నత విద్యావంతుల పార్టీ వైఎస్సార్‌సీపీ

14 May, 2019 04:58 IST|Sakshi
దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీల్లోని ఉన్నత విద్యావంతులైన అభ్యర్థుల శాతం

‘ఫ్యాన్‌’ గుర్తుపై పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం మంది బాగా చదువుకున్నవారే

‘ఇండియా టుడే’తాజా సంచికలో కథనం

చదువురాని వారు 2 శాతం

దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో పట్టభద్రుల సగటు 48 శాతం 

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన లోక్‌సభ అభ్యర్థుల్లో అత్యధికంగా ఉన్నత విద్యావంతులకు టికెట్లు ఇచ్చిన పార్టీగా వైఎస్సార్‌ సీపీ రికార్డు సృష్టించింది. ‘ఇండియాటుడే’ తాజా సంచికలో ఈ వివరాలను ప్రచురించింది. జాతీయ పార్టీలేవీ విద్యావంతులకు టికెట్లు ఇవ్వడంలో అగ్రస్థానంలో నిలవలేకపోయాయని ఇండియా టుడే అనుబంధ విభాగమైన ‘డేటా ఇంటెలి జెన్స్‌ యూనిట్‌’ పేర్కొంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల్లో బాగా చదువుకున్నవారే ఉండటంతో జాతీయ స్థాయిలో ‘పఢీ లిఖీ పార్టీ’ (ఉన్నత విద్యావంతుల పార్టీ)గా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

నూతన ఒరవడికి నాంది
ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాలకు వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది పట్టభద్రులు, ఆపై విద్యార్హతలు కలిగిన వారే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండి తీరాలని బలంగా ఆకాంక్షించే వైఎస్‌ జగన్‌ ప్రతి సందర్భంలోనూ నైతిక విలువలకు పెద్దపీట వేస్తున్నారు. రాసి కాదు వాసి ముఖ్యమని భావించిన జగన్‌ ఏరి కోరి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారిని ఎంపిక చేసి ఎన్నికల బరిలోకి దింపారు. ఎంతో ముందుచూపుతో రాజకీయాల్లో నూతన ఒరవడి నెలకొల్పాలని ఆయన తీసుకున్న నిర్ణయం నేడు జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 

అగ్రభాగాన వైఎస్సార్‌ సీపీ
ఇండియాటుడే అనుబంధ విభాగమైన ‘డేటా ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ దేశవ్యాప్తంగా ఆరో విడత వరకు వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలను సేకరించి క్రోడీకరించింది. ప్రాంతీయ పార్టీల నుంచే ఎక్కువ మంది విద్యావంతులైన అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలోకి దిగారని తెలిపింది. అలాంటి ఐదు ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్‌ సీపీ అగ్రభాగాన నిలిచింది. అభ్యర్థుల విద్యార్హతల ప్రాతిపదికన ఈ నిర్థారణ జరిగింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలున్నా దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీలే విద్యావంతులకు టికెట్లు ఇవ్వడంలో అధిక ప్రాధాన్యం ఇచ్చాయి.  వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారు. తమిళనాడులో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే అభ్యర్థుల్లో 87.5 శాతం మంది ఉన్నత విద్యార్హతలు కలిగిన వారున్నారు. ఏఐడీఎంకే అభ్యర్థుల్లో 86 శాతం మంది, టీఆర్‌ఎస్‌ (తెలంగాణ) అభ్యర్థుల్లో 82 శాతం, తమిళనాడుకే చెందిన నామ్‌ తమిళ్‌ కచ్చి (ఎన్‌టీసీ) పార్టీ అభ్యర్థుల్లో 80 శాతం మంది విద్యార్హతలు గల వారున్నారు. 

బీఎస్పీలో స్వల్పం...
జాతీయ పార్టీల విషయానికి వస్తే ఉన్నత విద్యావంతులైన అభ్యర్థుల శాతం తక్కువగా ఉంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల్లో 70.8 శాతం మంది, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల్లో 75.7 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యావంతులున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో చాలా తక్కువగా 52.5 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యావంతులున్నారు. పలుచోట్ల ఇబ్బడి ముబ్బడిగా రంగంలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థుల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటే కేవలం 38 శాతం మంది మాత్రమే పట్టభద్రులు న్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో పట్టభద్రులైన విద్యావంతులు సగటున 48 శాతం మంది మాత్రమే ఉన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌(పశ్చిమ బెంగాల్‌) అభ్యర్థుల్లో 74.5 శాతం, బిజూ జనతాదళ్‌ (ఒడిషా) అభ్యర్థుల్లో 71.4 శాతం మంది పట్టభద్రులున్నారు. 

చదువురానివారు 2 శాతం..
దేశం మొత్తం మీద ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల్లో 2 శాతం మంది బొత్తిగా చదువురాని వారున్నారు. అన్ని రంగాల్లో తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉన్నత విద్యార్హతలకు ప్రాధాన్యం పెరిగింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఇంటా బయటా దిగ్విజయంగా రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్యావంతులదే పై చేయిగా ఉంది. దేశ రాజకీయాల్లోనూ అది పరిస్థితి ఉత్పన్నమవుతోందని జాతీయ స్థాయి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రాజకీయాల్లో ఉండే వారికి విద్యార్హతలతో పెద్దగా పనిలేదు. కానీ క్రమంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారి విద్యార్హతల విషయంలో ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై చర్చ, వివాదం రేకెత్తిన నేపథ్యంలో రాజకీయాల్లో విద్యకు ప్రాధాన్యం పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు