కరోనా కట్టడిలో ఐఐటీలు

1 Apr, 2020 03:50 IST|Sakshi

మొబైల్‌ అంబు బ్యాగ్‌ రూపొందించిన హైదరాబాద్‌ ఐఐటీ

పోర్టబుల్‌ వెంటిలేటర్‌ తయారీలో కాన్పూర్‌ ఐఐటీ 

కరోనా వైరస్‌ను గుర్తించే పరికరాలు అందించిన గౌహతి ఐఐటీ

ఇన్ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫ్యాబ్రిక్స్‌ అభివృద్ధి చేసిన ఢిల్లీ ఐఐటీ  

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశంలోని అత్యున్నత జాతీయ విద్యాసంస్థలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థలు కరోనా వైరస్‌ను నిరోధించే పరికరాలను తయారు చేస్తూ అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాయి.

ఇన్ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫ్యాబ్రిక్స్‌ 
ఆస్పత్రుల్లోని సిబ్బంది, రోగులకు ఇన్ఫెక్షన్‌ రాకుండా నిరోధించడానికి ‘ఇన్ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫ్యాబ్రిక్స్‌’ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహకారంతో ఢిల్లీ ఐఐటీ అభివృద్ధి చేసింది. 
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఆస్పత్రులకు వచ్చే ప్రతి 100 మందిలో 10 మంది ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో ఇన్ఫెక్షన్ల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది.  
అధునాతన టెక్స్‌టైల్‌ టెక్నాలజీ ద్వారా సాధారణ కాటన్‌ను ఇన్ఫెక్షన్‌ ప్రూఫ్‌గా మార్పు చేశారు. ఇది శక్తివంతమైన యాంటీ మైక్రోబయాల్‌గా మారి ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది.  
ఉతికిన తరువాత కూడా ఇవి యధావిధిగా ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి. బెడ్‌షీట్లు, యూనిఫామ్, కర్టెన్లు ఇలా దేనికైనా ఈ వస్త్రాన్ని ఉపయోగించవచ్చు.  
రోడ్లు, పార్కులు, మైదానాలు, ఇతర ప్రాంతాల్లో మానవ రహితంగా శానిటైజర్‌ను స్ప్రే చేసేందుకు గౌహతిలోని ఐఐటీ విద్యార్థులు ఆటోమేటెడ్‌ స్ప్రేయర్‌ డ్రోన్‌ను అభివృద్ధి చేశారు. 
మొబైల్‌ ఫోన్‌తో నియంత్రించే డ్రోన్‌ .. 3 కిలోమీటర్ల పరిధిలో సిగ్నలింగ్‌ వ్యవస్థ ద్వారా ఇది పని చేస్తుంది.   

రియల్‌ టైమ్‌ పీసీఆర్‌ రెడీ 
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రియల్‌ టైమ్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) యంత్రాలను ఐఐటీ గౌహతి రూపొందించి అక్కడి ఆస్పత్రులకు అందించింది. 
రోబో ఆధారిత స్క్రీనింగ్‌ యూనిట్లు, హైకెపాసిటీ ఆటోక్లేవ్‌ మెషిన్లు, టెంపరేచర్‌ మెజరింగ్‌ యూనిట్లు అందించింది.  
ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్‌–19 నివారణకు ఐఐటీ గౌహతిలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు  చేస్తున్నారు.  

రూ.4 లక్షల వెంటిలేటర్‌ రూ.70 వేలతోనే.. 
ఐఐటీ కాన్పూర్‌ తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్లో రూ.4 లక్షలకు పైగా ఉండే వెంటిలేటర్‌ను దేశీయంగా లభించే పరికరాలు వినియోగించి రూ.70 వేలతోనే దీనిని రూపొందించింది.  
ఒక్క నెలలోనే 1,000 పోర్టబుల్‌ వెంటిలేటర్లను సిద్ధం చేయొచ్చు. దీన్ని మొబైల్‌కు అనుసంధానించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.  
అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ సిలిండర్‌ను అమర్చుకునే వీలు కూడా ఇందులో ఉంటుంది.   

బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌ 
ఎక్కడికైనా తీసుకువెళ్లేందుకు వీలుగా ‘అంబు బ్యాగ్‌’ పేరుతో బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌ను హైదరాబాద్‌ ఐఐటీ సిద్ధం చేసింది. 
అత్యవసర పరిస్థితుల్లో శ్వాసక్రియను కొనసాగింప చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.  
దీని తయారీకి కేవలం రూ.5 వేలు మాత్రమే ఖర్చవుతుంది. చేతితో పని చేయించే ఈ సాధనం రోగికి అప్పటికప్పుడు శ్వాసను అందించగలుగుతుంది. దీనిని బ్యాటరీతో కూడా పని చేయించవచ్చు.  

మరిన్ని వార్తలు