ఇక వర్షాలే... వర్షాలు

15 Sep, 2019 03:51 IST|Sakshi

వచ్చేనెల మూడో వారం వరకు ఇదే పరిస్థితి

ఆశాజనకంగా ‘నైరుతి’

వారాంతపు నివేదికలో భారత వాతావరణ విభాగం వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: మారుతున్న సముద్ర, ఉపరితల ఉష్ణోగ్రతలు నైరుతి రుతు పవనాలపై మరిన్ని ఆశలు పెంచుతున్నాయి. ఎల్‌నినో దక్షిణ ఆశిలేషన్‌లు (గాలి సుడులు వంటివి) తటస్థంగా కొనసాగుతున్నాయి. పసిఫిక్‌ మహా సముద్ర ఉష్ణోగ్రతలు, మధ్య పసిఫిక్‌ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇవి రుతు పవనాల కాల పరిమితిని పెంపొందిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు హిందూ మహాసముద్రంలో ధ్రువపు పరిస్థితులు (ఐఓడీ) కూడా నైరుతికి అనుకూలంగా ఉన్నాయి. ఇవన్నీ నైరుతి రుతు పవనాల కొనసాగింపునకు దోహదపడుతున్నాయనీ.. ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోనూ విరివిగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేస్తున్నారు.

రుతు పవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెల మూడో వారం నుంచి దక్షిణ భారత దేశంలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. ఈ సమయంలో ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే జోన్‌ ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా ప్రయాణిస్తుందని, ఇవి బంగాళాఖాతంలోకి వచ్చిన తర్వాత అల్పపీడనాలు విపరీతంగా ఏర్పడతాయని వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబర్‌ మూడో వారం వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన వారాంతపు నివేదికలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. రాబోయే రెండు, మూడు వారాల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఏర్పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
మరోవైపు.. వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తు వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. దీనికి తోడు.. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులూ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శనివారం రాత్రి వెల్లడించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఈనెల 16, 17, 18 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. గడచిన 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. బాపట్లలో 8 సెంటీమీటర్లు, అవనిగడ్డలో 6, గూడూరు, గుంటూరులో 5, తిరువూరు, విజయవాడ, లాం(గుంటూరు)లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు