సెల్యూట్‌ రంజిత్‌

3 May, 2019 08:25 IST|Sakshi
ఐఎన్‌ఎస్‌ రంజిత్‌

విశ్రాంతి తీసుకోనున్న భారత యుద్ధ నౌక

36 ఏళ్ల సుదీర్ఘ సేవలందించిన ఐఎన్‌ఎస్‌ రంజిత్‌

కాషిన్‌ క్లాస్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌లో మూడో నౌక

6న డాక్‌యార్డులో డీకమిషన్‌

విశాఖ సిటీ: శత్రువుకు ఆ నౌక వైపు చూడాలం టేనే వెన్నులో వణుకు పుట్టేది. దాయాదులు దాడిని ముందుగానే పసిగట్టి.. వారు ప్రణా ళిక అమలు పరచకముందే.. సముద్రంలోనే అంతమొందించే అత్యాధునిక వ్యవస్థను సొంతం చేసుకొని 36 ఏళ్ల పాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్‌ఎస్‌ రంజిత్‌ ఈ నెల 6న విధులకు స్వస్తి పలకనుంది. మిసైల్‌ డిస్ట్రాయర్‌గా అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా చాటిన రంజిత్‌కు భారత నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది.

సదా రణే జయతే నినాదంతో..
భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన కాషిన్‌ క్లాస్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ నౌకల్లో ఐఎన్‌ఎస్‌ రంజిత్‌ మూడో నౌకగా ఖ్యాతినార్జించింది. రష్యాలో 1979లో లౌక్లీ పేరుతో రూపుదిద్దుకుంది. 1983 సెప్టెంబర్‌ 15న భారత నౌకాదళంలో చేరిన రంజిత్‌.. 36 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించింది. శత్రుదుర్భేధ్యమైన ఈ నౌకకు తొలి కెప్టెన్‌గా విష్ణుభగవత్‌ వ్యవహరించారు. తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో ఇది సేవలందించింది. సదా రణే జయతే(రణరంగంలో ఎల్లప్పుడూ విజయమే) నినాదంతో సాగర జలాల్లో దూసుకుపోయిన రంజిత్‌ యుద్ధ నౌకంటే శత్రు సైన్యానికి దడ పుట్టేదని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. 3,950 టన్నుల బరువుతో 147 మీటర్ల పొడువు, 15.8 మీటర్ల బీమ్, 5 మీటర్ల డ్రాఫ్ట్‌తో తయారైన ఈ నౌకలో 4 గ్యాస్‌ ఇంజిన్లున్నాయి. గంటకు 35 నాటికల్‌ మైళ్లు(65 కిలోమీటర్లు) వేగంతో దూసుకుపోయేది. 35 మంది అధికారులు, 320 మంది సిబ్బందిని తీసుకెళ్లగల సామర్థ్యం రంజిత్‌ సొంతం. యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మెరైన్‌గా రంజిత్‌ని వినియోగించారు. మిసైల్స్, గన్స్‌తో పాటు టార్పెడో ట్యూబ్‌ లాంచర్, చేతక్‌ హెలికాఫ్టర్లు నౌకలో ఉండేవి. శక్తివంతమైన బ్రహ్మాస్త్రాల్లాంటి క్షిపణులు ప్రయోగించడంలో రంజిత్‌ ప్రముఖ పాత్ర పోషించింది. అత్యంత శక్తిమంతమైన క్షిపణులతో పాటు అత్యాధునిక ఆయుధాల్ని మోసుకెళ్లేది. శత్రు లక్ష్యాల్ని, వారి నుంచి ఎదురవ్వబోయే దాడుల్ని ముందుగానే గుర్తించి సిబ్బందికి సిగ్నల్‌ ఇచ్చే వ్యవస్థ రంజిత్‌ సొంతం.

అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా..
క్షిపణులతో దాడి చేస్తూ.. శత్రువుల గుండెల్లో నిద్రపోయిన రంజిత్‌ దేశ విదేశాల్లో జరిగిన విన్యాసాల్లో సత్తా చాటింది. 1991–92లో యూఎస్‌ నేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాసెక్స్, మలబార్‌ విన్యాసాలు, 2003లో ఇండియా–రష్యా(ఇంద్ర) విన్యాసాలు, 2003 నవంబర్‌లో సారెక్స్‌ విన్యాసాలు, 2007లో పసిఫిక్‌ తీరంలో జరిగిన అంతర్జాతీయ విన్యాసాల్లో పాల్గొని భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. 2004 సునామీ సమయంలోనూ, 2014 హుద్‌హుద్‌ తుపాను సమయంలో విపత్తు నిర్వహణలో ఐఎన్‌ఎస్‌ రంజిత్‌ కీలక పాత్ర పోషించింది.

డాక్‌యార్డులో డీకమిషన్‌
మూడున్నర దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవలందించిన ఐఎన్‌ఎస్‌ రంజిత్‌ ఈ నెల 6న సేవల నుంచి రిటైర్‌ కాబోతోంది. ఈ డీకమిషన్‌ కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ రంజిత్‌లో సేవలు అందించిన కెప్టెన్‌లు, అధికారులకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు