రాష్ట్రానికి రాష్ట్రపతి దంపతుల రాక

9 Jul, 2019 08:32 IST|Sakshi

15న చంద్రయాన్‌ ప్రయోగానికి ముఖ్యఅతిథిగా హాజరు

పటిష్ట ఏర్పాట్లు

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

సాక్షి, నెల్లూరు(పొగతోట): భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ దంపతులు ఈ నెల 14వ తేదీన షార్‌కు రానున్నారు. శ్రీహరికోట నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌–2ను ప్రయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతితోపాటు ఆయన సతీమణి కూడా షార్‌కు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు శ్రీహరికోట చేరుకుంటారు. ప్రయోగం వీక్షించిన తర్వాత 15వ తేదీ రాష్ట్రపతి తిరుగు ప్రయాణమవుతారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షార్‌ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రపతి దంపతుల రాక సందర్భంగా సోమవారం కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్టపతి దంపతులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం షార్‌కు వస్తున్నారని తెలిపారు. వారికి ఎలాంకి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవసరమైన మందులు అంబులెన్స్‌తో సిద్ధంగా ఉంచాలన్నారు. షార్‌లోని ఆస్పత్రిలో అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి  ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది వివరాలను డీఆర్‌డీఓకు అందజేయాలన్నారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 12వ తేదీన ట్రయల్‌రన్‌ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, జాయింట్‌ కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, డీఆర్‌ఓ సి.చంద్రశేఖరరెడ్డి, గూడూరు సబ్‌ కలెక్టర్‌ ఆనంద్, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ మురళి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్‌ భార్గవి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు