విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కానీ..

22 Mar, 2020 12:16 IST|Sakshi
కుటుంబాన్ని ఓదారుస్తున్న ఎంపీ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి

ఉద్యోగం కోసం స్వీడన్‌ వెళ్లి మృత్యువాత

స్వదేశానికి మృతదేహం తరలింపునకు అంతరాయం

కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

ఎంబసీతో ఎంపీ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చర్చలు

చేతికి అందివచ్చిన కుమారుడు విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడన్న ఆనందం.. ఆ కుటుంబానికి ఎంతోకాలం నిలవలేదు. పట్టుమని ఆరు నెలలు గడవకముందే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడన్న సమాచారం అతడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో అతడి మృతదేహాన్ని కడసారి చూడలేని దుర్భర పరిస్థితిలో వారు ఉన్నారు. వారిని ఓదార్చడం సన్నిహితులు, కుటుంబ సభ్యుల వల్ల కావడం లేదు. ఆ యువకుడి మృతి.. అతడిలో తీవ్ర విషాదాన్ని తెచ్చింది.

సాక్షి, కాకినాడ: స్థానిక శ్రీరామ్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్, మంగతాయార్ల కుమారుడు పీసపాటి కృష్ణ చైతన్య (35) సుమారు ఆరు నెలల క్రితం స్వీడన్‌ వెళ్లారు. అక్కడ క్యాప్‌ జెమినీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇంకా వివాహం కూడా కాని కృష్ణచైతన్య ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ కుటుంబానికి పిడుగు లాంటి వార్త చేరింది. స్వీడన్‌లో అతడు విధి నిర్వహణలో గుండెనొప్పితో కుప్పకూలిపోయాడని, తోటి ఉద్యోగులు ఆస్పత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే అతడు మరణించినట్టు స్వీడన్‌లో వైద్యులు ధ్రువీకరించారు. 

మృతదేహం కోసం.. 
కరోనా ప్రభావంతో కృష్ణచైతన్య మృతదేహం ఇక్కడికి చేర్చేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరోనా ప్రభావం వల్ల ఇరుదేశాల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఈ నెల 29వ తేదీ వరకు రద్దు కావడంతో సమస్య జఠిలమైంది. అందరూ ఉండి ఎవరూ లేని అనాథలా కుమారుడి మృతదేహం స్వీడన్‌లో నిలిచిపోవడం ఆ కుటుంబానికి చెప్పలేనంత విషాదాన్ని నింపింది.

అక్కడి కంపెనీ అధికారులు, ఇతర వర్గాలతో చర్చించినా ప్రయోజనం లేకపోయింది. స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యేలు  ఈ విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవ తీసుకున్నారు. లోక్‌సభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా కేంద్ర విదేశాంగశాఖ మంత్రి, స్వీడన్‌లోని ఎంబసీ అధికారులతో చర్చించారు.

మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక విమానం ద్వారా మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున వీరి కృషికి కూడా ప్రతిబంధకం ఏర్పడింది. ఈ నెల 29వ తేదీ వరకు విమానయానానికి అంక్షలు ఉన్నందున ఆ తరువాత కూడా కొనసాగితే పరిస్థితి ఏమిటని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ప్రధానంగా ఈ నెల 30వ తేదీ దాటితే ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉండే ఓ మత సంస్థకు అప్పగిస్తారనే సమాచారంతో వారిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ కుమారుడిని కడసారైనా చూసే అవకాశం కల్పించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.  

ఓదార్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు 
ఆండాళ్లమ్మ కళాశాలలో లెక్చరర్‌గా పదవీ విరమణ చేసిన కృష్ణచైతన్య తల్లిదండ్రులు చంద్రశేఖర్, మంగతాయారులను కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శనివారం పరామర్శించారు. శ్రీరామ్‌నగర్‌లోని వారి ఇంటికి వెళ్లి కేంద్రం, ఎంబసీ అధికారులతో చర్చిస్తున్న విషయాన్ని వారికి చెప్పారు. మృతదేహాన్ని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని, ఆందోళన చెందవద్దని వారిని ఓదార్చారు.

పెద్ద సంఖ్యలో బంధువులు, సన్నిహితులు మృతుని ఇంటికి చేరుకుంటున్న నేపథ్యంలో, వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ప్రభుత్వం తీసుకునే చొరవ వల్ల మృతదేహం కొంత జాప్యమైనా స్వదేశానికి వస్తుందన్న విశ్వాసాన్ని మృతుడి మేనమామ బ్రహ్మయ్య శాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు ఆ కుటుంబాన్ని ఓదార్చారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా