యూ.. తెలుగు.. ట్యూబ్‌

28 Dec, 2019 08:38 IST|Sakshi

ముచ్చట్ల కంటే వీడియోలు చూసేందుకే ప్రాధాన్యం  

యూట్యూబ్‌లో 6,740 కోట్ల వ్యూస్‌తో తొలి స్థానంలో తెలుగు

4,550 కోట్ల వ్యూస్‌తో తర్వాతి స్థానంలో తమిళ ‘తంబి’ 

చూడటమే కాదు.. అప్‌లోడ్‌లోనూ మనమే ఫస్ట్‌ 

దేశంలో భారీగా పెరిగిన మొబైల్‌ డేటా వాడకం

రోజుకు సగటున 67 నిమిషాలు వీడియోలకే..

సాక్షి, అమరావతి: స్మార్ట్‌ ఫోన్ల రాకతో దేశంలో మొబైల్‌ డేటా వినియోగం భారీగా పెరుగుతోంది. మొబైల్‌లో ముచ్చట్ల కంటే నచ్చిన వీడియోలను తిలకించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి మొబైల్‌ వినియోగదారుడు రోజుకు సగటున 67 నిమిషాలు వీడియోలు చూడటానికే సమయం కేటాయిస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 2012లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే వీడియోలకు కేటాయించగా ఇప్పుడు రోజుకు ఏకంగా గంటకుపైగా వీడియోల లోకంలో విహరిస్తున్నట్లు ‘యాప్‌ అన్నే’ సంస్థ తెలిపింది. వీడియోలు తిలకించేందుకు అత్యధికంగా యూట్యూబ్‌ను అనుసరిస్తుండగా ఆ తర్వాత స్థానాల్లో హాట్‌స్టార్, జియో టీవీ, ప్రైమ్‌ వీడియో యాప్స్‌ ఉన్నాయి.  

జియో రాకతో జోరుగా... 
రిలయన్స్‌ జియో రాకతో దేశంలో డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగినట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. డేటా ధరలు దిగి రావడంతో 2016లో నెలకు సగటున 20 కోట్ల జీబీగా ఉన్న డేటా వినియోగం 2018 నాటికి ఏకంగా 370 కోట్ల జీబీకి చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి 5491 కోట్ల జీబీ డేటాను వినియోగించినట్లు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్‌ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ప్రాంతీయ భాషల్లో తెలుగు హవా... 
హిందీయేతర వీడియోల విషయానికి వస్తే తెలుగు వీడియోలకు అత్యధిక డిమాండ్‌ ఉన్నట్లు ‘విడోలి’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. తెలుగు వీడియోలకు అత్యధిక వీక్షకాదరణ ఉంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయ్యే వీడియోల్లో తెలుగువే అత్యధికంగా ఉంటున్నాయి. ప్రాంతీయ భాషల్లో 2018లో తెలుగు వీడియోలను 6,740 కోట్ల సార్లు వీక్షించడంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తమిళ, పంజాబీ, మలయాలీ, భోజ్‌పురి వీడియోలున్నాయి. తెలుగులో న్యూస్‌ చానళ్లు, సినీరంగ విషయాలకు ఆదరణ లభిస్తోంది. ఇక 5 జీ రంగప్రవేశం చేస్తే డేటా వినియోగం హోరెత్తనుంది. 


యూజర్లు ఇలా పెరిగారు
సంవత్సరం      ఇంటర్నెట్‌  వాడకందారుల  సంఖ్య (కోట్లలో)
2015                   25.99 
2016                   29.6 
2017                   48.1 
2018                   56.6  
2019                   62.7 (అంచనా) 

ప్రాంతీయ భాషా వీడియోల వీక్షణల సంఖ్య (కోట్లలో) 
భాష             2016        2018 
తెలుగు        1,270        6,740 
తమిళం        8,20        4,550 
పంజాబీ        4,40        3,000 
మలయాళం  380        1,990  
భోజ్‌పురి        250        3,140  

 రెండేళ్లలో ఐదు రెట్లు  పెరుగుదల... 

  • 2016లో తెలుగు వీడియోల వీక్షణల సంఖ్య 1,270 కోట్లు కాగా రెండేళ్లలో ఇది 6,740 కోట్లకు చేరింది.  
  • యూట్యూబ్‌లో అత్యధికంగా అప్‌లోడ్‌ అవుతున్న వీడియోల్లో తెలుగే మొదటి స్థానంలో ఉన్నట్లు ‘విడోలి’ తెలిపింది.  
  •  2016లో మొత్తం 1.6 కోట్ల తెలుగు వీడియోలు అప్‌లోడ్‌ కాగా 2018 నాటికి ఇది 16.6 కోట్లు దాటేసింది.  
మరిన్ని వార్తలు