ఆగిన ఇందిరమ్మ ఇళ్లు

18 Mar, 2014 03:32 IST|Sakshi

 లబ్ధిదారులకు సవ్యంగా అందని బిల్లులు
 రెండు నెలలుగా ముప్పు తిప్పలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. అధికారులు బిల్లులు చెల్లించకపోవటంతో... చేతిలో డబ్బులు లేక లబ్ధిదారులు పనులు పక్కన పెట్టేశారు. బిల్లులు ఎప్పుడు అందుతాయో తెలియక గృహనిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక మొత్తం విడుదల కాకపోవడమే సమస్యకు కారణంగా తెలుస్తోంది. ఇటీవలి వరకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను గృహనిర్మాణ సంస్థ ఎండీ ఆధ్వర్యంలో విడుదల చేసేవారు. ప్రభుత్వం ఆ త్రైమాసిక మొత్తాన్ని ఎండీ ఖాతాలో వేసేది. దాన్ని ఆ నెలకు సంబంధించి అధికారులు రూపొందించిన నివేదిక ఆధారంగా లబ్ధిదారులకు చెల్లించేవారు. కానీ గత నవంబర్‌లో ఈ విధానాన్ని మార్చి... నేరుగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు జరిపే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం నేరుగా సంబంధిత బ్యాంకుల నుంచే లబ్ధిదారుల ఖాతాలోకి బిల్లుకు సంబంధించిన డబ్బులు వెళ్లిపోతాయి. ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు గృహ నిర్మాణ సంస్థలో ప్రత్యేకంగా ఓ చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో అధికారిని నియమించారు. పాత విధానం అమలులో ఉన్నప్పుడు చెక్కులు రూపొదించటం, వివరాలు నమోదు చేయటం, ఆ నిధులు ఖాతాలకు మళ్లించటం.... తదితర కసరత్తు వల్ల కొంత ఆలస్యంగా బిల్లులు అందేవి. కానీ కొత్త విధానం వల్ల కేవలం మూడు రోజుల్లోనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలోకి చేరిపోతాయంటూ అధికారులు ప్రచారం చేశారు. తొలి నెలలో  అనుకున్నట్టే అమలైంది. కానీ.. జనవరి నుంచి సమస్య మొదలైంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం దాదాపు రూ.100 కోట్లు విడుదల చేశారు. వీటితో ఆ నెల 21 వరకు పెండింగుపడిన బిల్లులు చెల్లించేశారు. మిగతా నిధులు రాకపోయేసరికి దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు చెందిన లబ్ధిదారులు పనులు నిలిపివేసి బిల్లుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది. తుదకు జిల్లా స్థాయి అధికారులకు కూడా నిధులెప్పుడొస్తాయో తెలియని గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన కసరత్తు ముమ్మరం కావటంతో సచివాలయంలోని ఉన్నతాధికారులు ఆ పనిలో నిమగ్నమై దీన్ని గాలికొదిలేశారు.
 
 ఫిబ్రవరి 24 వరకే అందాయి
 
 ‘‘ఫిబ్రవరి 24 వరకు నిధులు అందాయి. వాటిని లబ్ధిదారులకు చెల్లించాం. ఆ తర్వాత నిధులు రావాల్సి ఉంది. ప్రస్తుతం నేను వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నందున... నిధులు ఎప్పుడొచ్చే విషయంపై సమాచారం లేదు.’’ -  గృహనిర్మాణ సంస్థ సీజీఎం జగదీశ్‌బాబు
 
 నెలన్నరగా కాళ్లరిగేలా తిరుగుతున్నం
 
 ‘‘ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలుపెట్టి నెలన్నర క్రితమే బేస్‌మెంట్ వరకు పూర్తి చేసుకున్నం. మొదటి విడత బిల్లు కోసం అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా నిధులు లేవని చెప్తున్నరు. వ్యవసాయ కూలీ పనిచేసుకునే మాకు పైసలెక్కడినుంచి వస్తయ్. చేసేదిలేక పని ఆపేసినం.’’
 -ఉప్పరి పుణ్యవతి, నాగిరెడ్డి గూడ, రంగారెడ్డి జిల్లా
 
 పీడీల ఆవేదన: ‘‘పరిస్థితి దారుణంగా ఉంది.  బిల్లులు ఎప్పుడొస్తాయంటూ లబ్ధిదారులు కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వచ్చి నిలదీస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇక మేము కార్యాలయాలకు వెళ్లలేం. లబ్ధిదారుల నిలదీతను తట్టుకోలేం’’ అంటూ పలు జిల్లాల పీడీలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు