2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు రద్దు!

13 Aug, 2014 03:30 IST|Sakshi

ఏపీ సర్కారు వ్యూహరచన
 సాక్షి విజయవాడ బ్యూరో: ఏపీలో సుమారు 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది! మూడేళ్లుగా ప్రారంభం కాని ఇళ్లు, మంజూరైన వాటిలో అనర్హులు తదితరాల పేరుతో సర్వే చేయించడానికి మండల స్థాయిలో కమిటీలను రంగంలోకి దించనుంది. బుధవారం గృహ నిర్మాణ మంత్రి కిమిడి మృణాళిని తన శాఖకు చెందిన జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.400 కోట్ల బిల్లుల్లో వీలైనంత కోత పెట్టడం, జిల్లాకు కనీసం 15 వేల ఇళ్లు రద్దు చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయడమే సమీక్ష లక్ష్యమని సమాచారం. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద పక్కా ఇంటి కోసం ఎమ్మెల్యే చుట్టూనో, మంత్రి చుట్టూనో ప్రదక్షిణలు చేయకుండా అడిగిన వెంటనే ఇళ్లు మంజూరు చేసేలా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాట్టు చేయడం తెలిసిందే. ఎన్నికల ఏడాదిలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించే విషయంలో సాగదీత వ్యవహారం నడిపింది.
 
 దీంతో ఈ ఏడాది మార్చి నుంచి రూ. 400 కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే బకాయిలు చెల్లిస్తుందని లబ్ధిదారులు ఎదురుచూశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణం, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడంపై శ్రద్ధ చూపేలా కనిపించడం లేదు. పైగా వివిధ కారణాలు చూపుతూ మంజూరైన ఇళ్లను రద్దు చేసి కొత్త వాటిని మంజూరు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మృణాళిని నిర్వహించనున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు