ఇందిరమ్మ ఇల్లు ఓ కల

11 Dec, 2013 04:26 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వేగంగా సాగిన ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం రెండడుగులు ముందుకు మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఇప్పటి వరకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 468 కోట్లు ఖర్చుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా సొంత ఇళ్లు లేని నిరుపేదలు ఎందరో ఉన్నారు. ఇటీవల జరిగిన మూడో విడత రచ్చబండలో ఇంది రమ్మ ఇళ్ల కోసం 48 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
 
 జిల్లాకు మం జూరైన ఇళ్లలో  25,589  ఇళ్లు అసంపూర్తి దశలో ఉన్నాయి. వీటిలో 4,417 ఇళ్లు పునాది దశలో, బేస్‌మెంట్ లెవల్‌లో 13,688 ఇళ్లు, లెంటల్ లెవల్‌లో 1,783 ఇళ్లు, రూఫ్‌లెవల్‌లో 5,701 ఇళ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రుణపరిమితిని పెంచింది. గతంలో రూ.35 వేల నుంచి 45 వేల వరకు అందించేవారు. ఇప్పుడు ఎస్సీలకు రూ.లక్ష, బీసీలు, ఇతరులకు రూ.75 వేలు, ఎస్టీలకు రూ.1.5 లక్షలు రుణంగా ఇస్తున్నారు. సిమెంటు, స్టీలు ధరలు విపరీతంగా పెరి గిపోవడంతో సర్కారు ఇచ్చే డబ్బులు ఇళ్ల నిర్మాణానికి సరిపోవడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలామంది ఇళ్ల నిర్మాణానికి వెనుకంజ వేస్తున్నారు. 
 
 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతోనే ఉన్న ఇళ్లను కూల్చేసి ఆశ్రయం కోల్పోయిన కుంటుబాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నెలవారీగా 9,986 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించగా జిల్లాలో 5,288 మాత్రమే పూర్తిచేశా రు. ఇళ్ల మంజూరు మొదలుకొని సిమెంటు బస్తాల పంపిణీ, బిల్లు విడుద ల కోసం దళారుల ప్రమేయంతో ముడుపులు ముట్టజెప్పనిదే పనికావడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వర కు లంచాల రూపంలో చెల్లించాల్సి వస్తోందంటున్నారు. ఇళ్లు నిర్మించుకోకుండానే.. పాత ఇంటిని చూపించి బిల్లులను స్వాహా చేస్తున్న వారూ ఉన్నారు. అధికార పార్టీ నేతల అండతో ఈ స్వాహా పర్వం నడుస్తోంది.
 
 53 వేల ఇళ్ల రద్దుకు యోచన
 జిల్లాలో ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టని లబ్ధిదారుల దరఖాస్తులను రద్దు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. రుణాలు మంజూరైనా నిర్మాణం మొదలు పెట్టని ఇళ్లు 31,867 ఉన్నాయి. ఇంకా గృహ నిర్మాణ శాఖలో రిజిష్టర్ కాని దరఖాస్తులు 21,149 వరకు ఉన్నా యి. ఈ దరఖాస్తులను నమోదు చేయటానికి సమయం ఇచ్చినప్పటికీ లబ్ధిదారులు సరైన అర్హత పత్రాలను అందజేయడం లేదని అధికారులు తెలిపారు.  రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. మూడవ విడత రచ్చబండలో వచ్చిన 48 వేల దరఖాస్తులను పరిశీలించి ఇందులో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయాలని అధికారులు భావిస్తున్నారు. 
మరిన్ని వార్తలు