ప్రాణం మీదకు తెచ్చిన ప్రైవేటు వడ్డీ

29 Sep, 2017 03:10 IST|Sakshi

వడ్డీ వ్యాపారి వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఒంగోలు కలెక్టరేట్‌లో పురుగుమందు తాగిన బాధితుడు

చంపుతానని వడ్డీ వ్యాపారి బెదిరిస్తున్నాడంటూ ఆవేదన

ఒంగోలు టౌన్‌ : ప్రైవేట్‌ వడ్డీలు ఓ బడుగుజీవి ప్రాణాల మీదకు తెచ్చాయి. జీవనోపాధి కోసం తీసుకున్న అప్పునకు అసలు, వడ్డీ చెల్లించినా ఇంకా చెల్లించాలని, లేదంటే చంపుతానని బెదిరిస్తుండటంతో తన గోడు అధికారులకు చెప్పుకుందామని అర్జీ చేతపట్టుకుని కలెక్టరేట్‌కు వెళ్లాడు. కలెక్టర్‌ కార్యాలయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు కొత్తపట్నం రోడ్డులోని ఎన్‌టీఆర్‌ కాలనీలో కాకర్ల మోషె కుర్చీలకు వైర్లు అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదాయం తగ్గిపోవడానికి తోడు మోషె అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో ఒంగోలుకు చెందిన రాపూరి వాసు అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. నెలకు నూటికి ఆరు రూపాయల వడ్డీ చొప్పున రోజువారీ డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. డబ్బులు మొత్తం వడ్డీతో సహా రూ.4 లక్షలు చెల్లించినప్పటికీ ఇంకా కట్టాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.

చివరకు దౌర్జన్యానికి కూడా దిగుతున్నాడు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, వంద రూపాయల స్టాంపు పేపర్లపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నాడు. రెక్కాడితేగాని డొక్కాడని తనకు అప్పు ఇచ్చిన వారికి వడ్డీ సహా చెల్లిస్తే ఇంకా చెల్లించాలంటూ బెదిరిస్తుండటంతో మోషె తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఒకవైపు వడ్డీ వేధింపులు, ఇంకోవైపు అనారోగ్య పరిస్థితులు తట్టుకోలేక పోయాడు. తన సమస్యలను అర్జీ రూపంలో రాసుకుని గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కొద్ది సేపు మెట్ల మీద కూర్చున్న మోషె వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మోషేను, పక్కన పురుగుల మందు డబ్బాను గమనించి అక్కడున్నవారు వెంటనే రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు 48 గంటల పాటుఅబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పారు.

చంపుతానని బెదిరిస్తున్నాడు..
తాను తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ రాపూరి వాసు అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని మోషె వాపోయాడు. ప్రామ్సరీ నోట్లు, స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకోవడంతోపాటు డబ్బు చెలించకుంటే చంపుతానంటూ ఇంటికి వచ్చి బెదిరించాడన్నాడు. దీంతో తనకు మరణమే శరణ్యమని పురుగులమందు తాగినట్లు చెప్పాడు. తన గోడు జిల్లా కలెక్టర్‌కు చెప్పుకోవాలన్న ఉద్దేశంతో కలెక్టరేట్‌కు వెళ్లినట్లు తెలిపాడు. తనను, తన కుటుంబాన్ని వాసు బారి నుంచి కాపాడాలని వేడుకున్నాడు.

మరిన్ని వార్తలు