త్వరలో పారిశ్రామిక విప్లవం 

19 Oct, 2019 08:54 IST|Sakshi
క్యారీ ఏ బ్యాగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రజత్‌భార్గవ్, కలెక్టర్‌ సత్యనారాయణ తదితరులు

సాక్షి, హిందూపురం(అనంతపురం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక విప్లవం వస్తోందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్‌భార్గవ్‌ అన్నారు. శుక్రవారం హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో పరిశ్రమలశాఖ కమిషనర్‌ సుబ్రమణ్యం అధ్యక్షతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘పరిశ్రమస్థాపన–సులభతరమైన అనుమతులు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో రజత్‌భార్గవ్‌ మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు  కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాన్ని యువతకు కల్పించేందుకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యం ఉద్యోగులు అందించబోతున్నామన్నారు. రాష్ట్రంలో 1,16,000 చిన్న తరహా క్టస్టర్లుండగా వాటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తోందన్నారు. రానున్న ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో 13 పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఒక్కో పరిశ్రమలో 10వేల నుంచి 12వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఇక పరిశ్రమల పేరుతో భూములు తీసుకుని ఇంతవరకూ పరిశ్రమలు ఏర్పాటు చేయని వారి నుంచి భూములు వెనక్కు తీసుకుంటామన్నారు. 

దేశానికే మనం ఆదర్శం 
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని రజత్‌ భార్గవ్‌ వివరించారు. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారన్నారు. త్వరలోనే వైజాగ్‌–చైన్నె, బెంగళూరు–చెన్నై కారిడర్లు వస్తున్నాయని, ఇందులో ఎనిమిది క్లస్టర్లు ఉంటాయని చెప్పారు. బెంగళూరు–చెన్నై కారిడార్‌లో ఉన్న హిందూపురం క్లస్టర్లు మార్కెటింగ్‌ అభివృద్ధికి వచ్చే ఏడాది రూ.1,500 నుంచి రూ. 2 వేల కోట్ల నిధులు కేటాయింపులు ఉంటాయన్నారు. అలాగే పరిశ్రమలకు అనుకులంగా జిల్లాలో విమానాశ్రయాల నుంచి రవాణా సౌకర్యాలు  పెంచుతున్నామన్నారు. కర్నూలు ఎయిర్‌పోర్టును మరో ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.  

పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలం 
కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ, పరిశ్రమలు నెలకొల్పడానికి జిల్లాలో అవసరమైన భూములతో పాటు గొల్లపల్లి, హంద్రీనీవా ద్వారా నీటిసదుపాయం ఉందన్నారు. అలాగే మానవ వనరులు కూడా అధికంగా ఉన్నాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని, అందువల్లే సింగిల్‌ డెస్క్‌ ద్వారా వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం తరఫున అందించాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. జిల్లాలో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 48 ప్రముఖ కంపెనీలు 36 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఇంకా వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ, ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం టాప్‌ ప్రియారీటి ఇస్తోందని, అన్ని శాఖలను కలవాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌ ద్వారా అన్ని అనుమతులు సులభతరంగా మంజురు అయ్యేలా రూపకల్పన చేసిందన్నారు. అనంతరం పర్యావరణ హితం కోసం రూపొందించిన క్యారీ ఏ బ్యాగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం తూమకుంట పారిశ్రామికవాడలోని పరిశ్రమలను పరిశీలించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్‌ జాహ్నవి, సబ్‌ కలెక్టర్‌ నిశాంతి, స్పెషల్‌ ఆఫీసర్‌ సుదర్శనబాబు, సమాచార శాఖ ఏడీ జయమ్మ, తహసీల్దార్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా