ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ నిర్మిస్తాం

7 Mar, 2016 23:42 IST|Sakshi
ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ నిర్మిస్తాం

కలెక్టర్ యువరాజ్
 
అచ్యుతాపురం:ఎస్‌ఈజెడ్ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు వసతి ఏర్పాటుకు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ యువరాజ్ తెలిపారు. సోమవారం ఆయన బ్రాండిక్స్  పరిశ్రమను సందర్శించారు.   దూరప్రాంతాలనుంచి పరిశ్రమకు రావడం వల్ల ఎదుర్కొం టున్న సమస్యలను యాజమాన్యం, ఉద్యోగులనుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులను తరలించడంలో పరిశ్రమలకు భారంగా ఉందన్నారు. ఉద్యోగులు వ్యయప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్య, ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా టౌన్‌షిప్ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఉద్యోగులు తమ జీతం నుంచి కొంత భాగాన్ని వాయిదాగా చెల్లించడానికి ముందుకు వస్తే ఇంటినిర్మాణం చేపట్టి అందిస్తామన్నారు. ఇందుకోసం చోడపల్లి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు.

సెజ్‌కు సమీపంలో మరికొంత ప్రభుత్వ స్థలాన్ని సేకరించి టౌన్‌ఫిప్‌కు సిద్ధం చేస్తామని వివరించారు. చదరపు అడుగు రూ.వెయ్యి నుంచి రూ.1500 ధరలో నిర్మాణం చేపట్టేలా సంస్థలకు అప్పగిస్తామన్నారు. ఉద్యోగికి తక్కువ ధరకు అపార్‌‌టమెంట్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  మొదటి వాయిదా చెల్లించిన వెంటనే ఉద్యోగికి ఇల్లు అప్పగిస్తామని వాయిదాలు పూర్తయిన తరువాత ఇంటి డాక్యుమెంట్‌ను అందజేస్తామని చెప్పారు.

మొదటి విడతగా 15 వేల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్మించే పైపులైన్‌కు పూడిమడక మత్స్యకారులు సహకరించాలని కోరారు.  ఉన్నఫలంగా 4,500 మందికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యపడదన్నారు. ప్యాకేజీ తీసుకొని పైపులైన్‌క అంగీకరిస్తే అంచెలంచెలుగా ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దీనిపై మత్స్యకారులతో బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్ హెచ్‌ఆర్ మేనేజర్ రఘుపతి, భాస్కర్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు