పరిశ్రమల ఖిల్లాగా సింహపురి - మంత్రి మేకపాటి

22 Aug, 2019 06:29 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా, మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ 

స్థానికులకే ఉద్యోగావకాశాలు :  – మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి వారు సీఎం జగన్, మంత్రి మేకపాటి : – ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా 

సమస్యలు పరిష్కరించాలి : – పారిశ్రామికవేత్తలు 

సాక్షి, నెల్లూరు : నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. జిల్లాను పరిశ్రమల ఖిల్లాగా మార్చడమే కాకుండా  యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన కోసం ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనే అంశంపై దర్గామిట్టలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం రాష్ట్రానికి అదృష్టమన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమల స్థాపనలో ఎలాంటి విజన్‌లేకుండా పనిచేసిందని ఆరోపించారు. గడిచిన ఐదేళ్ల పరిపాలనలో, ల్యాండ్‌ పాలసీలోనూ విఫలం అయిందన్నారు. అన్ని శాఖలతో పాటు ఏపీఐఐసీ శాఖ తరుపున టీడీపీ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. ఈ అప్పును ఆ శాఖ ద్వారా ఉద్యోగాల కల్పన, పరిశ్రమల స్థాపన కోసం కాకుండా పసుపు–కుంకుమ వంటి పథకాలకు డైవర్ట్‌ చేసిందన్నారు.

గత ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రస్తుతం మనమందరం ఆ భారాన్ని మోయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం ఒక పారిశ్రామిక వేత్తకు ఎకరా రూ.12లక్షలకు, పక్కనే మరో పారిశ్రామికవేత్తకు రూ.33 లక్షలకు అప్పగించిందన్నారు. ఇలాంటి తేడాలు గమనిస్తే పారిశ్రామికవేత్తలు ఎందుకు ముందుకు వస్తారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన పాలసీ తెస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలను అంబాని, అదాని, బిల్‌గేట్స్‌లాగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలో ఏపీఐఐసీ వద్ద 26,688 ఎకరాల భూములు ఉండగా, 16,597 ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ఇచ్చామని తెలిపారు. ఈ భూముల్లో 1275 కంపెనీలు పరిశ్రమలు పెట్టాయన్నారు. ఇంకా 12వేల ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమల స్థాపనకు యువకులు ముందుకురావాలని కోరారు.

పరిశ్రమ అంటే మాప్రాంతానికి తెలియదు 
ఉదయగిరి ప్రాంతంలో పరిశ్రమ అంటే ఏమిటో కూడా తెలియదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తమది  మెట్టప్రాంతమన్నారు. బాగా వెనుకబడిన ప్రాంతమన్నారు. నీటి సౌకర్యం లేక పంటలు పండడం లేదని తెలిపారు. తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టే పనైతే తానొక్కడినే 30వేల ఎకరాల భూములు ఇప్పిస్తానన్నారు. ఇకనైనా తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. 

భూములు మావి...ఉద్యోగాలు మావి కావు
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ పరిశ్రమలకు ఇచ్చిన భూములన్ని మావేనని తెలిపారు. అయితే ఉద్యోగాలు మాత్రం మావి కాదన్నారు. మంచి గాలిని మేము పరిశ్రమల వారికి అందజేస్తే వారు మాకు కలుషిత, దుర్గంధంతో కూడిన గాలిని ఇస్తున్నారని తెలిపా. నాయుడుపేటలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో తాను వినతి పత్రం అందజేస్తే అందుకు అనుగుణంగా స్థానికులకే 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించాడన్నారు. ఇకనైనా అందుకనుగుణంగా స్థానిక యువతకు ఉద్యోగాలు పరిశ్రమల్లో ఇవ్వాలన్నారు. అలాగే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. తడ ఐటీఐలో 10 ఎకరాల భూమి ఉందని ఇక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 

దుగరాజపట్నం ఓడరేవును అభివృద్ధి చేయాలి
తమ ప్రాంతంలో ఉండే దుగరాజపట్నం ఓడరేవును అభివృద్ధి చేసే ప్రాజెక్టు కేంద్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించి  కేంద్రం వద్దకు పంపి పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దుగరాజపట్నంను అభివృద్ధి చేయడం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. తమ ప్రాంతాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాలని కోరారు.  

నీటి వసతి, రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలి: పారిశ్రామికవేత్తలు 
 పలువురు పారిశ్రామిక వేత్తలు మాట్లాడుతూ నాయుడుపేట, మేనకూరుసెజ్, అత్తివరం పరిశ్రమల ఏరియాలో పరిశ్రమలకు నీటి వసతి లేదన్నారు. పరిశ్రమలను విస్తరించడానికి తెలుగు గంగ ద్వారా నీటిని కేటాయిస్తూ గతంలో ఇచ్చిన జీఓను అమలు చేయాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల కోసం వేసిన పైపులైన్లు, రోడ్లు, తదితర నిర్మాణ పనుల్లో అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కృష్ణపట్నంపోర్టు పరిసర ప్రాంతాల్లోని ఆయిల్‌ పరిశ్రమల యజమానులు మాట్లాడుతూ తమకు విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉందన్నారు. రవీంద్రరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ తాను సిలికా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు 25 ఎకరాలు కేటాయించాలని కలెక్టర్, వీఆర్వో, తహసీల్దార్‌ చుట్టూ నేటికి తిరుగుతున్నాన్నారు. తనకు భూములు కేటాయిస్తే 200 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. అయినా స్పందన లేదని తెలిపారు. మరికొంతమంది మందుల పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ హైదరాబాద్‌లో పొల్యూషన్‌ వల్ల ఇక అక్కడ పరిశ్రమలు విస్తరించేందుకు వీలులేదన్నారు. అందువల్ల నెల్లూరులో విస్తరించేందుకు మంచి అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇందుకు తమకు రాయితీలు కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమాధానమిస్తూ కృష్ణపోర్టు పరిశ్రమల యజమానులకు విద్యుత్తు ఇచ్చేందుకు అదనపు కండక్టర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మేనకూరు, నాయుడుపేట ప్రాంతాల్లోని సెజ్‌లకు జాతీయరహదారిని లింక్‌ చేస్తూ త్వరలోనే రోడ్లు నిర్మిస్తామన్నారు. తెలుగుగంగ నీటిని పరిశ్రమలకు కేటాయిస్తామన్నారు. విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. వచ్చే సోమవారం మళ్లీ సమీక్షిస్తానని తెలిపారు. పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న వారి 21 రోజుల్లోగా అనుమతులు ఇస్తామన్నారు. పరిశ్రమల వారికి ఎలాంటి ఇబ్బందులు రానీయబోమని తెలిపారు. జిల్లాను అటు చెన్నై, ఇటు బెంగళూరు కారిడార్‌లకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు సంబంధించిన  పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ మంజూరు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్ధజైన్‌ , ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌భార్గవ, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. 

బాహుబలి, సైరానరసింహారెడ్డిలాగా సీఎం, ఐటీ మంత్రి 
బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల పట్ల భారీ అంచనాలు ఉన్నట్టే యువకులైన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటì గౌతంరెడ్డిపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా పేర్కొన్నారు. ఆ అంచనాలకు తగిన విధంగానే ప్రజలకు మంచి సేవలు అందించేందుకు పని చేస్తున్నారన్నారు. ఒక్క దరఖాస్తు ద్వారానే పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు ఇస్తున్నారన్నారు. జిల్లాలో మేనకూరు సెజ్, నాయుడుపేట, అత్తివరం, తదితర 11 రకాల పరిశ్రమల పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 8 «థర్మల్‌ కేంద్రాలను స్థాపిస్తే వాటిలో 5 ప్రాజెక్టులకే  4823 ఎకరాలు కేటాయించామన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 

పరిశ్రమలు స్థాపించేందుకు ఉత్సాహం టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో వర్షాలే పడలేదని జలవనరుల శాఖామంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అన్నారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వర్షాలు కురుస్తున్నాయన్నారు. వర్షాలు కురిసినట్టే పరిశ్రమలు స్థాపించేందుకు అనేక మంది ఉత్సాహంగా  ముందుకు వస్తున్నారన్నారు. ఇక్కడ రహస్యాలు ఉండవన్నారు. తమది పారదర్శక ప్రభుత్వమని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీశైలం నుంచి నెల్లూరుకు నీటిని తీసుకురావడంలో విఫలమయ్యామని ఆరోపణలు చేస్తున్న జిల్లా టీడీపీ నాయకులు కళ్లుతెరిచి చూడాలన్నారు. ఒక్క రోజులోనే సోమశిలకు 2.4 టీఎంసీల నీరు చేరుతున్నాయని తెలిపారు. సీఎం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారన్నారు. అందరం కలిసి కష్టపడి జిల్లాను పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉంచుదామని తెలిపారు. 

మరిన్ని వార్తలు