రాజధానిలో పరిశ్రమల పంట

26 Oct, 2015 00:58 IST|Sakshi
రాజధానిలో పరిశ్రమల పంట

అనుమతి కోసం వందలకొద్దీ దరఖాస్తులు
గుంటూరులో 782 మధ్య తరహా కంపెనీల ఏర్పాటు
విజయవాడ నగరంలో ఆటో మొబైల్, కార్ల కంపెనీలు
సీఆర్‌డీఏ పరిధిలో స్టార్ హోటళ్లు

 
విజయవాడ : నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రైవేటు కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించడంతో పాటు మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేకంగా జోన్‌లు ఏర్పాటు చేసి వేల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ప్రముఖ కంపెనీలు రాజధాని ప్రాంతంలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 30కి పైగా ప్రధాన కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకోగా, మధ్యతరహా కంపెనీలు 782 దరఖాస్తు చేసుకున్నాయి. ఇక  రాజధాని ప్రాంతంలో నూతనంగా విద్యా సంస్థలు, హోటళ్ల ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు
రాజధాని ప్రాంతంలో మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు సాగించే అవకాశాలు ఉన్నాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ సచివాలయం, రాజ్‌భవన్, ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు మూడేళ్ల కాలవ్యవధిలో నిర్మించే అవకాశం ఉంది. దీనికనుగుణంగా రాజధాని ప్రాంతంలో ప్రైవేటు సంస్థల  భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగనున్నాయి. ముఖ్యంగా గత నెలరోజులుగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొంత కదలిక వచ్చింది. రాజధాని ప్రాంతంలో భారీ ఇన్‌ఫ్రా సంస్థలు, అపార్టుమెంట్లు, మల్టీస్టోరేజ్ భవనాల నిర్మాణానికి సీఆర్‌డీఏ వద్ద అనుమతులు తీసుకోనున్నాయి. ఇప్పటివరకు 16కు పైగా ప్రధాన కంపెనీలు శంకుస్థాపనలు పూర్తి చేసుకున్నాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. గడిచిన ఆరునెలల కాలంలో గుంటూరు జిల్లా పరిశ్రమల కేంద్రంలో అనుమతులు తీసుకుని 782 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇవి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థలు. వీటికి ఐదు రెట్లు రుణ సౌకర్యం ప్రభుత్వం అందించింది. ఇప్పటివరకు రూ.188.78 కోట్లు విలువైన  మధ్యతరహా పరిశ్రమలు రాగా వీటి ద్వారా 10,381 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్, పౌల్ట్రీ, టైలరింగ్, బిస్కెట్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇవి కాకుండా మాస్టర్ ప్లాన్‌లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ జోన్‌లో పరిశ్రమలు నిర్మించడానికి పదుల సంఖ్యలో మల్టీ నేషనల్ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఎంవోఈలు కుదుర్చుకోగా, రెండు వారాల క్రితం 12 కంపెనీలు రూ.1800 కోట్ల విలువైన ఏంవోఈలు కుదుర్చుకున్నాయి.

 ఆర్థిక రాజధానిగా విజయవాడ
 కేవలం రాజధాని నగరంగానే కాక ఆర్థిక రాజధానిగా కూడా విజయవాడ వెలుగొందుతోంది. ముఖ్యంగా కార్ల కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు విజయవాడ నగరం సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. భవానీపురంలో 30కి పైగా ప్రధాన ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. గన్నవరం, గొల్లపూడి ప్రాంతాల్లో టాటా, నిస్సాన్, టయోటా, బెంజ్ షోరూమ్‌లు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. వీటితోపాటు, కార్లు, ద్విచక్ర వాహనాల విడి భాగాల తయారీ యూనిట్లు కూడా పదికి పైగా విజయవాడలో సిద్ధం అయ్యాయి. విజయవాడ నగరం ప్రధానంగా వాణిజ్యంపైనే ఆధారపడి  ఉంది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నుంచి తరలి వచ్చే కంపెనీల ద్వారా ఇక్కడ ఆదాయం 30శాతంకు పైగా పెరిగింది. తాజ్ గ్రూప్, ఐటీసీ, గ్రూపులు రాజధాని ప్రాంతంలో 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి స్థల అన్వేషణ పూర్తి చేశాయి. ఇవి కాకుండా అమరావతి ప్రాంతంలో ఫైవ్‌స్టార్ కేటగిరీ హోటళ్లు ఎనిమిది  ఏర్పాటు చేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. రాష్ట్ర విభజనతో జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఆదాయం రెట్టింపు అయింది.
 

>
మరిన్ని వార్తలు