‘అనంత' నేషనల్ పార్క్ పిక్నిక్ స్పాట్ కావాలి

13 Oct, 2014 02:08 IST|Sakshi
‘అనంత' నేషనల్ పార్క్ పిక్నిక్ స్పాట్ కావాలి

అనంతపురం సిటీ: ‘అనంత'లో సువిశాల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్కు పిక్నిక్ స్పాట్‌గా మారాలని పలువురు ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు. నేషనల్ పార్కులో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి నేతృత్వంలో కొనసాగుతున్న శ్రమదానంలో భాగంగా ఆదివారం 8వ రోజు ఎమ్మెల్యేలు పార్థసార థి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, విప్ యామినీబాల శ్రమదానం చేశారు. పారలు చేతబట్టి పలు మొక్కల చుట్టూ పాదులు చేశారు. పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1996లో ప్రభాకర్‌చౌదరి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు నేషనల్ పార్కు ఏర్పాటు శ్రమదానంలో భాగమేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ‘జన్మభూమి-మా ఊరు’లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రమదానానికి పిలుపునివ్వడం హర్షణీయమన్నారు.
 
 గతంలో నిర్లక్ష్యానికి గురైన నేషనల్ పార్కుకు పూర్వ వైభవం రానుందని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో దశల వారీగా అభివృద్ధి పర్చి శిల్పారామాన్ని నిర్మించి ‘అనంత’ పర్యాటక కేంద్రం’గా దీన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. డిప్యూటీ మేయర్ గంపన్న, టీడీపీ నాయకులు ఆదినారాయణ, లింగంనాయుడు, రవి, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు