దీక్ష పేలవం

3 Jun, 2016 07:28 IST|Sakshi

స్పందన నామమాత్రం..  దీక్ష పేలవం
నవనిర్మాణ దీక్షలో ఖాళీగా కుర్చీలు
ట్రాఫిక్ మళ్లింపుతో  {పయాణికుల పాట్లు
కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు

 

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ‘నవ నిర్మాణ దీక్ష’కు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఉదయం ఎనిమిది గంటలకే వేదిక వద్దకు సభికులు రావాల్సి ఉండగా.. 10 గంటలకు కూడా అంతంత మాత్రంగానే ప్రజలు వచ్చారు. దీంతో అధికారులు, తెలుగుదేశం నేతలు నానా హైరానా పడి డ్వాక్రా మహిళల్ని, అంగన్‌వాడీ కార్యకర్తల్ని, కార్పొరేషన్‌లో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తరలించారు. దీంతో పది గంటల ప్రాంతంలో వేదిక వద్ద మాత్రం ప్రజల సందడి కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం వస్తారనే ఉద్దేశంతో వెనుకవైపు వేసిన కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్క్రీన్లను పట్టించుకునే నాథుడే కనిపించలేదు. స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లే స్క్రీన్ పనిచేయక మొరాయించింది.

 
జనస్పందన కోసం తహతహ...

సీఎం చంద్రబాబు దీక్షా వేదికపై  ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, రాష్ట్రాభివృద్ధికి తాను  ఎలా కష్టపడుతున్నదీ వివరించినా జనం పట్టించుకోలేదు. తన ప్రసంగానికి కనీసం ప్రజల నుంచి చప్పట్లు కొట్టడం కానీ, గాలిలో చేతులు ఊపటం కానీ లేకపోవడంతో చంద్రబాబు ప్రజాస్పందన కోసం నాలుగువైపులా చూడటం కనిపించింది. గంటకు పైగా సాగిన ప్రసంగంలో గతంలో జరిగిన పరిణామాలనే ప్రజలకు గుర్తు చేయడంతో సభికుల్లో అసహనం కనిపించింది. ఉదయం 11 గంటలకు చంద్రబాబు సభికులతో ప్రతిజ్ఞ చేయించి ప్రసంగం ప్రారంభించారు. 12.15 గంటలకు సమావేశం ముగిసింది.

 
చిరిగిన ఫెక్ల్సీలు.. ఖాళీగా కుర్చీలు...

13 జిల్లాల నుంచి ప్రజలు తరలివస్తారని అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేసినా వేదికకు నాలుగువైపుల, వెనుకవైపు ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వేదిక సమీపంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేస్తున్న ఫొటోలతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గాలికి అవి ఎగిరి చిరిగిపోయాయి. దీంతో సమావేశం జరగడానికి ముందే వేదిక వెనుక వైపు ఉన్న చిరిగిన ఫ్లెక్సీలను తొలగించారు.

 
అడుగడుగునా ట్రాఫిక్ జామ్...

గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి నగరంలోనికి ట్రాఫిక్‌ను అనుమతించకపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై, కనకదర్గమ్మ వారిధిపై, ఎర్రకట్టపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీక్ష అనంతరం వీటిని క్లియర్ చేయడానికి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. నవ నిర్మాణ దీక్షకు ప్రజల్ని సమీకరించేందుకు ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను ఉపయోగించుకున్నారు. వీటిని గ్రామాలకు పంపించి అక్కడి నుంచి గ్రామస్తులను తరలించారు.

 

మరిన్ని వార్తలు