సత్రం భూములు స్వాహా

23 Jun, 2019 11:31 IST|Sakshi
పెదకాపవరంలో సత్రం భూమి ఆక్రమించి బోరు వేసిన రొయ్యల రైతు

కుచించుకుపోతున్న విస్తీర్ణం

పట్టించుకోని అధికారులు

సరిహద్దుదారులకు సంతర్పణ

సాక్షి, ఆకివీడు (పశ్చిమ గోదావరి): సత్రం భూములంటే చులకన ఎందుకో. పూర్వం సత్రాలను ఏర్పాటు చేసి, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు సత్రాలను ఏర్పాటు చేశారు. సత్రానికి వచ్చే జనంకు ఉచితంగా భోజన వసతి కల్పించేవారు. ఆ ప్రకారంగా నూజివీడు జమిందారులు తమ ఆధీనంలో ఉన్న భూముల్ని సత్రాలకు, దేవాలయాలకు, అర్చకులకు దారాధత్తం చేశారు. తీపర్రు గ్రామంలోని ఈడ్పుగంటి రత్తమ్మ సత్రంకు నూజివీడు జమిందారులు 19 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు.

సేవా తత్పరతతో ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథలకు, దూర ప్రయాణికులకు వసతులు కల్పించేందుకు ఈ సొమ్మును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. తీపర్రులోని ఈడ్పుగంటి రత్తమ్మ సత్రంకు చెందిన భూమి ఆకివీడు మండలంలోని పెదకాపవరం గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో 19 ఎకరాల మాగాణి భూమి ఉంది. దీని ద్వారా సత్రంకు ఏటా రూ.3.35 లక్షలు ఆదాయం వస్తుంది. రెండు పంటలు పుష్కలంగా పండే పంట భూమి ఏడాదికి ఎకరాకు రూ.20 వేలు లీజు చెల్లిస్తున్నారు.

సత్రం భూమి అన్యాక్రాంతం
సత్రం భూమి అన్యాక్రాంతం అయ్యింది. సరిహద్దుల్లో ఉన్న రైతుల ఆక్రమణల్లో కుంచించుకుపోతోంది. సత్రం భూమిలో సరిహద్దు రైతు బోరు వేసి తన రొయ్యల చెరువుకు ఉప్పునీటిని తోడుకుంటున్నారు. మరో రైతు కూడా సత్రం భూమిలో అనధికారికంగా బోరు వేశారు. నేనేమీ తక్కువ కాదన్నట్లు మరో సరిహద్దు రైతు ఇంకో రెండు మెట్లు ఎక్కి తన రొయ్యల చెరువుకు ఏకంగా రోడ్డు మార్గాన్నే నిర్మించేశారు. తన చెరువుకు అనువుగా రోడ్డు కూడా నిర్మించారు.

మరో సరిహద్దు రైతు తన రొయ్యలచెరువుకు సత్రం భూమిలో విద్యుత్‌ స్తంభాలు పాతుకుంటూ వెళ్లిపోయి, విద్యుత్‌ సరఫరా పొందారు. సత్రం భూమిని ఇలా నాలుగు వైపులా ఉన్న సరిహద్దు దారుల ఆక్రమణల చెరలోకి వెళ్లిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సత్రం భూములు సన్నగిల్లి, కుంచించుకుపోతాయని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్రం భూముల ఆక్రమణలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నోటీసులిస్తాం
తీపర్రులోని ఈడుపుగంటి రత్తమ్మ సత్రం భూములు పెదకాపవరంలో 19 ఎకరాలున్నాయి. దీనిలో 3 ఎకరాలు చెరువుల సాగుతో నిరుపయోగంగా ఉంది. మరో 16 ఎకరాల భూమిలో వరి సాగుకు లీసుకు ఇచ్చాం. ఎకరాకు రూ.20 వేలు చొప్పున ఏడాదికి రూ.3.64 లక్షలు ఆదాయం వస్తుంది. అన్యాక్రాంతమైన సత్రం భూముల ఆక్రమణదారులకు నోటీసులు అందజేస్తాం. తమ భూముల్ని పరిరక్షించాలని, తహసీల్దార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, ట్రాన్స్‌కో ఏఈడీకి ఫిర్యాదు చేస్తాం. త్వరలోనే సర్వే చేసి సత్రం భూముల్ని రక్షించుకుంటాం. 
– ఎం.వెంకట్రావు, కార్యనిర్వాహణాధికారి, కానూరు

>
మరిన్ని వార్తలు