ఇంకెందరు బలి కావాలో.

15 Jul, 2018 03:39 IST|Sakshi
మే 15న పోలవరం మండలంలో లాంచీ ప్రమాదంలో బాధితులను రక్షిస్తున్న సహాయక సిబ్బంది (ఫైల్‌)

పడవ ప్రమాదాలకు అడ్డుకట్ట పడేదెన్నడు?  

పాలకుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు 

విచ్చలవిడిగా తిరుగున్న అనుమతి లేని బోట్లు

 దుర్ఘటనలు జరుగుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం 

తూర్పు గోదావరి జిల్లాలో పలు గ్రామాలకు నాటు పడవలే దిక్కు 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మొన్న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద, నిన్న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని మంటూరు సమీపంలో, నేడు ఐ.పోలవరం మండలంలో... ప్రాంతం ఏదైనా కన్నీటి గాథ మాత్రం ఒక్కటే. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో చాలాగ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. బయటి ప్రపంచానికి రావాలంటే జనం నాటు పడవలను ఆశ్రయించడం తప్ప మరోదారి లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వానికి అనుమతి లేని బోట్లపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలు కనిపించకపోవడం గమనార్హం. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావుడి చేయడం, తూతూమంత్రంగా విచారణ సాగించడం, ఆ తర్వాత దాని గురించి మర్చిపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.  

నిర్వాహకుల అజాగ్రత్త  
తూర్పు గోదావరి జిల్లాలో అనుమతి లేని బోట్లే అధికం. వీటిలో నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పడవల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకైక ఆధారం లైఫ్‌ జాకెట్లే. నాటు పడవల్లో లైఫ్‌ జాకెట్లు కనిపించడం లేదు. కొన్ని బోట్లలో ఉన్నా వాటిని బయటకు తీయడం లేదు. ఓ మూలన పడేస్తున్నారు. పైగా ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. జిల్లాలో మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయన్న దానిపై అధికారుల వద్ద సరైన సమాచారం లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ప్రతిఏటా ఏప్రిల్‌లో రెన్యూవల్‌ చేయడం, పడవలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇచ్చేయడం షరా మామూలుగా మారిపోయింది. నిర్వాహకుల నుంచి లంచాలు దండుకుని నిబంధనల విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే బోట్లు కేవలం రెండే ఉన్నాయి. అధికారికంగా నడిచే మిగతా 64 బోట్లు ప్రైవేట్‌ వ్యక్తులవే. ఇవి కాకుండా అనధికారికంగా మరో 100 నాటు పడవలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా తిరుగున్న పడవలపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 

రాకపోకలకు పడవలే ఆధారం 
తూర్పు గోదావరి జిల్లాలో జనం నిత్యం ప్రమాదాల మధ్యే ప్రయాణం సాగిస్తున్నారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, సేరులంక, కొత్తలంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం, కాట్రేనికోన మండలం పలంకురు మధ్య ప్రయాణానికి పడవలే దిక్కు. కాట్రేనికోన మండలం మగసానితిప్ప, ఐ.పోలవరం మండలం గోగుల్లంక గ్రామానికి పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏజెన్సీ పరిధిలోని దేవీపట్నం మండలంలో 14 గ్రామాలకు రాకపోకలు సాగించాలంటే పడవలు తప్ప మరో గత్యంతరం లేదు. మామిడికుదురు, పి.గన్నవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం, ఆలమూరు, కడియం, సీతానగరం, రాజోలు, సఖినేటిపల్లి మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. 

ఇవీ నిబంధనలు.. 
- లైసెన్స్‌డ్‌ డ్రైవర్‌ మాత్రమే పడవ నడపాలి. 
- డ్రెస్‌కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి. 
- పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే తొలుత 15 రోజులపాటు లైసెన్స్‌ రద్దు చేయొచ్చు. 
- బోటులో లైఫ్‌ జాకెట్లు తప్పనిసరిగా ఉండాలి. లైఫ్‌ జాకెట్లు ధరిస్తేనే ప్రయాణికులను ఎక్కించాలి. 
- ప్రతి పది మంది ప్రయాణికులకొక లైఫ్‌ రింగ్‌ అందుబాటులో ఉంచాలి. 
- పడవలో ప్రథమ చికిత్స కిట్‌ తప్పనిసరిగా ఉంచాలి. 
- ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. 

మరిన్ని వార్తలు