అన్ని విత్తనాలు ఇంటి ముంగిట్లో..

3 Jun, 2020 03:25 IST|Sakshi

విత్తన పంపిణీ ప్రక్రియలో వినూత్న మార్పు

రైతు ఎక్కడ ఉంటే అక్కడికే విత్తనం

అన్నదాతల క్యూలు లేవు.. వడ దెబ్బలూ లేవు 

లాఠీల దెబ్బలు లేవు.. లైన్లలో చెప్పులు, చేటల జాడల్లేవ్‌

ఇప్పటికే 88 శాతం మంది రైతులకు విత్తనాలు 

నాణ్యమైన విత్తనాలకు ప్రభుత్వం భరోసా

ఇది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామం. గత ఏడాది విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇక్కట్లు పడిన గ్రామాల్లో ఇదొకటి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. విత్తనాల కోసం రైతులు ముందుగానే రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. కోవిడ్‌19 నిబంధనలకు అనుగుణంగా లైన్లో నిల్చున్నారు. వాళ్ల డాక్యుమెంట్లు చూపించారు. ఏ విత్తనం కావాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.48 గంటల్లో విత్తనాలు పొందారు.

ఇది అనంతపురం జిల్లా హిందూపురం మండలం చలివెందల. మారుమూల గ్రామం కావడంతో వేరుశనగ విత్తనం వస్తుందో లేదోనని ఎప్పుడూ బెంగ ఉండేది. ఈ ఏడాది ఎక్కడా భారీ క్యూలు లేవు. కుర్చీల్లో కూర్చోబెట్టి..వరుసగా పిలిచి.. మరీ విత్తన కాయల్ని ఇచ్చి పంపారు.

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో రైతులకు వారు ఉంటున్న ఊళ్లోనే విత్తనాలు అందుతున్నాయి. గతానికి భిన్నంగా వేరుశనగ సహా ఏ విత్తనం కోసం క్యూలలో ఎగశ్వాస, దిగశ్వాసతో నిలబడిన ఆనవాళ్లు లేవు. వడదెబ్బతో తల్లడిల్లిన ఘటనలు లేవు. చద్ది మూటతో తెల్లవారుజామునే వెళ్లి లైన్లో నిల్చొని తన వంతు వస్తుందో రాదో అనే ఆందోళన అసలే లేదు. తోపులాటలు లేవు. లాఠీచార్జీలు లేవు. అధికారులో, మాఫియా ముఠాలో ఇచ్చే నాసి రకం విత్తనాలు తెచ్చుకోవాల్సిన పని లేదు. నాణ్యత లేకపోతే తిరిగి ఇచ్చి మంచిది ఇమ్మని అడిగే హక్కు వచ్చింది. అదీ వేరెక్కడో కాదు. సాక్షాత్తు తన ఊళ్లోనే. తన పంచాయతీలోనే.. ఏడాదిలో ఎంత మార్పో.

రైతు భరోసా కేంద్రాల వల్లే సాధ్యం తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన రైతు శ్రీనివాస రెడ్డి చెప్పే దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల వల్లే ఇది సాధ్యమైంది. ‘మాకు కావాల్సిన వరి వంగడాల కోసం పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు తీసుకుని ఆర్బీకేకి వెళ్లి గ్రామ వ్యవసాయ సహాయకునికి ఇచ్చి నమోదు చేయించాం. 48 గంటల తర్వాత వెళ్లి విత్తనాలు తెచ్చుకున్నాం. ఊళ్లోనే విత్తనాన్ని తీసుకోవడం వల్ల రవాణా ఖర్చులు తగ్గాయి. అన్నింటికి మించి శ్రమ తగ్గింది. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఎక్కడో మార్కెట్‌ యార్డులో పెడితే అక్కడకు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది’ అని చెప్పారు. అనంతపురం జిల్లా బొమ్మేపర్తి మండలం డి.వెంకటరాయుడిదీ ఇదే కథనం. తనకు నాణ్యత లేని విత్తనాలు వచ్చాయని ఫిర్యాదు చేస్తే తిరిగి మంచివి ఇచ్చి వెళ్లారని చెప్పారాయన. ఇంతకు ముందు విత్తనం బాగా లేదంటే మా ఖర్మానికి పడి ఏడ్చే వాళ్లమన్నాడు.

18న ప్రారంభిస్తే 31కి 88 శాతం పూర్తి..
ఇంతకు ముందు ఐదారు రోజులైనా మీడియాలో వార్తలు, కనీసం ఇద్దరు ముగ్గురైనా బలి కానిదే విత్తన పంపిణీ ముగిసేది కాదు. ఈ ఏడాది అలాంటి ఘటనలే లేవు. మే నెల 18న 8.43 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీ ప్రారంభిస్తే ఎటువంటి అలికిడి లేకుండానే 31వ తేదీ నాటికి 88 శాతం పూర్తయిందంటే అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువ గందరగోళం జరిగే వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి సజావుగా సాగిపోయిందని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

గత ఏడాది 4,42,339 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సిద్ధం చేసుకుని 3,96,659 మంది రైతులకు 4,04,744 క్వింటాళ్లను పంపిణీ చేశారు. ఈ ఏడాది 5,07,598 క్వింటాళ్ల విత్తనాల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశారు. విత్తనం కోసం 5,71,549 మంది 4,49,180 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అందులో మే నెల 31నాటికి 4,95,013 మంది రైతులకు 3,94,991 క్వింటాళ్ల కాయల్ని పంపిణీ చేశారు. అంటే మొత్తం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రైతుల్లో వీరు 88 శాతం. 

గ్రామ స్థాయి విత్తన పంపిణీతో ప్రయోజనాలెన్నో..
– అనంతపురం జిల్లాలో 2,70,913 మంది, చిత్తూరులో 1,51,950 మంది, వైఎస్సార్‌ కడపలో 30,450 మంది, కర్నూలు జిల్లాలో 41,466 మంది, విజయనగరం జిల్లాలో 234 మంది రైతులు వేరుశనగ విత్తనాన్ని తీసుకున్నారు. ఇంకా ఎవరికైనా విత్తనం కావాలంటే జూన్‌ 7 వరకు రైతు భరోసా కేంద్రాలలో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. 
– రాష్ట్రంలోని 9 జిల్లాలలో 13 రకాల వరి వంగడాలకు 3,67,393 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి 2,28,732 క్వింటాళ్ల వరి వంగడాలు కావాల్సి ఉంది. వీరిలో ఇప్పటి వరకు 93,397 మంది రైతులకు 48,061 క్వింటాళ్లను సరఫరా చేశారు. మిగతా వారికి ఒకట్రెండు రోజుల్లో పంపిణీ చేస్తారు. 
వరి వంగడాలు కావాల్సిన వారు కూడా ఈనెల 7 వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. 
– గతంలో గ్రామాల వారీగా షెడ్యూల్‌ వేసి మండల స్థాయిలో పంపిణీ చేసేవారు. దీంతో ఇబ్బందులు వచ్చేవి.
ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రామ స్థాయి పంపిణీతో పాత ఇబ్బందులు తొలగిపోయాయి. గతంతో పోలిస్తే విత్తనాల నమోదు, పంపిణీ నేరుగా గ్రామాల్లోనే జరగడం వల్ల రైతులకు శ్రమ, ప్రయాణ, సరఫరా ఖర్చులు తగ్గాయి.
– మండలానికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు గతంలో రాయితీ విత్తనాన్ని పొందే వారు కాదు. ఇప్పుడా పరిస్థితి తప్పింది. గతంలో నాణ్యతా ప్రమాణాల పట్టింపు లేదు. ఇప్పుడు నాణ్యత లేకుంటే విత్తనాన్ని తిరిగి ఇవ్వొచ్చు. అధికారులకు ఫిర్యాదు చేసి మంచివి తెప్పించుకోవచ్చు.
– గతంలో సామాజిక తనిఖీ ఉండేది కాదు. ఇప్పుడు అనర్హులు ఎవరైనా విత్తనాన్ని తీసుకుంటున్నారని తెలిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసి చర్య తీసుకోమని కోరవచ్చు. మధ్యవర్తులు, బ్రోకర్లకు తావు లేదు.
 
గ్రామ స్వరాజ్యమంటే ఇదే కదా..
ఈ ఏడాది విత్తనాన్ని గ్రామాల్లోనే సీజన్‌కు ముందే ప్రారంభించి పూర్తి చేశాం. ఇంతకు మించి గ్రామ స్వరాజ్యం ఏమి ఉంటుంది? ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లో రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

ఆర్బీకేలతో వ్యవసాయ విప్లవం 
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్రంలో వ్యవసాయ  విప్లవం మొదలైంది. దళారులు, మధ్యవర్తుల మాటే లేకుండా చేశాం. ముందుగా పేర్లను నమోదు చేసుకోవడం వల్ల అసలు సాగుదార్లు ఎవరో తేలింది. దీనివల్ల దుబారాను అరికట్టగలిగాం. 
– హెచ్‌.అరుణ్‌ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్‌

దూరాభారం తగ్గింది
వెల్దుర్తి మండల కేంద్రం నుంచి మా గ్రామం దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కొండ అంచున ఉంది. బస్సు సౌకర్యం లేదు. ప్రతి ఏడాది ప్రభుత్వం అందించే విత్తనాల కోసం మండల కేంద్రానికి వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు పడేవాళ్లం. విత్తనం పొందేందుకు కనీసం మూడు రోజులైనా పట్టేది. పొలం పనులు మానుకోవాల్సి వచ్చేది. గతంలో ఏనాడూ లేని విధంగా ఇలా మే నెలలోనే విత్తనాలు ఇచ్చింది లేదు. వానలు పడినప్పుడే ఇస్తుండ్రి. ఈ సారి మా ఊరి పంచాయతీ (శ్రీరంగాపురం సచివాలయం..అర కిలోమీటర్‌ దూరం)లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. వారం కిందటే 120 కేజీల వేరుశనగ విత్తనకాయలు తీసుకున్నా. అదనపు ఖర్చులేదు, సమయం వృథా కాలేదు. దూరాభారం తగ్గింది. ఇప్పటికే వాటిని ఒలిచి విత్తనాలు సిద్ధం చేసుకున్నాం. రేపో మాపో పదునైన వాన పడితే విత్తనాలేసేందుకు సిద్ధంగా ఉన్నాం. 
– ఎం.ఎల్లరాముడు, లక్షుంపల్లె, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా

వ్యయ ప్రయాసలు తొలిగాయి
ఈసారి ప్రభుత్వం ఊళ్లోనే విత్తనాలు ఇచ్చి మంచి పని చేసింది. ఇంతకుముందు సబ్సిడీ విత్తనాలు తీసుకోవడం పెద్ద ఇబ్బందిగా ఉండేది. గ్రామం నుంచి వాహనాన్ని బాడుగకు తీసుకుని పోయి..డోన్‌ మార్కెట్‌ యార్డులో తెచ్చుకునేవాళ్లం. విత్తనాలు చేతికి అందేందుకు మూడు, నాలుగు రోజులు కూడా పట్టేది. ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ద్వారా అందజేశారు. వ్యయప్రయాసలు తొలగడమే కాకుండా, సకాలంలో విత్తనాలు వేసుకునే అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు.
– బి.రమణయ్య, వలసల గ్రామం, డోన్‌ మండలం, కర్నూలు జిల్లా

మరిన్ని వార్తలు