సిగ్నల్‌ పడింది.. పాయింట్‌ తప్పింది

5 Dec, 2019 13:29 IST|Sakshi
పట్టాలు తప్పిన ఎస్‌ఎల్‌ఆర్‌ బోగీ క్లాంపర్‌ పక్కకు తొలగిన దృశ్యాలు

షిర్డిఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభం  

తొలగిన క్లాంపర్‌..పట్టాలు తప్పిన చక్రాలు

ఎస్‌అండ్‌టీ జేఈని సస్పెండ్‌ చేసిన అధికారులు

రాజంపేట : తిరుపతి నుంచి షిర్డి (17417) వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన సంఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. రైల్వేకోడూరు స్టేషన్‌లో మంగళవారం సిగ్నల్‌ పడగానే డ్రైవర్‌ రైలును కదిలించారు. రైలింజన్‌ పాయింట్‌ దాటింది. అయితే వెనుక ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ (బోగీ) పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

ఎస్‌అండ్‌టీ జేఈ సస్పెన్షన్‌
ఇందులో భాగంగా సిగ్నల్‌ సాంకేతిక వ్యవస్థకు సంబంధించిన ఎస్‌అండ్‌టీ శాఖ జేఈ మురళీకృష్ణను సస్పెండ్‌ చేస్తూ గుంతకల్‌ డీఎస్‌టీఈ బీఎస్‌ ప్రసాద్‌  ఉత్తర్వులు జారీచేశారు. ఈయనతోపాటు పర్మినెంట్‌ వే డిపార్టుమెంట్‌కు చెందిన అధికారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. గుంతకల్‌ ఏడీఆర్‌ఎం సైమన్‌  ప్రమాదం జరిగిన వెంటనే ఈ మార్గంలో ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన సందర్భంగా నేరుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు.

తొలగిన క్లాంపర్‌...
తిరుపతి నుంచి వచ్చిన షిర్డి ఎక్స్‌ప్రెస్‌ రైలును రైల్వేకోడూరు స్టేషన్‌లో నాలుగో లైనులో తీసుకున్నారు. సెకండ్‌ ప్లాట్‌ఫాంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్లీ రైలుకు సిగ్నల్‌ వేశారు. అయితే రైలు కదిలిన కొద్ది క్షణాల్లోనే కట్‌పాయింట్‌ దాటుకొని రైలింజన్‌ వెళ్లింది. ఇదే క్రమంలో క్లాంపర్‌ సరిగా లేకపోవడంతో రెండోబోగీ చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో అప్రమత్తమైన లోకోఫైలెట్‌ రైలు నిలిపివేశారు. రైలు వేగంగా వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత ఎస్‌అండ్‌టీ విభాగానిదే అని రైల్వే అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రమాదంపై విచారణ ..
తిరుపతి–షిర్డి రైలు ప్రమాదంపై  రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేయనున్నారు. రైలు ప్రమాదాలకు గల కారణాలపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. ఈ ప్రమాదాన్ని రైల్వేశాఖ సీరియస్‌గా తీసుకోనుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా